ఎక్కడైనా చనిపోయిన వాళ్లు.. మళ్లీ ప్రాణాలతో తిరిగి వస్తారా? అంటే రారు అనే చాలా మంది సమాధానం చెబుతారు. అయితే తమిళనాడులో మాత్రం ఇలా జరిగింది. చనిపోయిన వ్యక్తి నోట్లో పాలు పోయగానే లేచి కూర్చున్నాడు. అయితే ఆ వ్యక్తి చనిపోక ముందే కుటుంబ సభ్యులు అంత్యక్రియల తంతు మొదలుపెట్టారు. ఈ ఘటన పుదుకోట్టై జిల్లా పొన్నమరావతి సమీపంలో జరిగింది. చనిపోయాడని భావించిన ఓ రైతు నోట్లో కొడుకుకు పాలు పోయగా.. అతడు ఉన్నపలంగా సజీవంగా లేవడం కలకలం రేపింది.
పుదుకోట్టై జిల్లా పొన్నమరావతి సమీపంలోని అనోమదంపట్టి గ్రామానికి చెందిన రైతు షణ్ముగం (61) గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ గత 20 రోజులుగా పొన్నమరావతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకుముందు సాయంత్రం నుండి అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతరం ప్రైవేట్ అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు. ఊరు దగ్గరకు రాగానే అపస్మారక స్థితిలో ఉండటంతో చనిపోయాడని భావించి ఇంటి ఆవరణలో ఉంచి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
శబరిమల యాత్రకు వెళ్లేందుకు ఉపవాస దీక్షలో ఉన్న ఆయన కుమారుడు సుబ్రమణ్యన్ (40) తన తండ్రి చనిపోయాడని భావించి విలపించి మెడలో దండను తీసి తండ్రి నోటిలో పాలు పోశాడు. అప్పుడు హఠాత్తుగా షణ్ముగం శరీరంలో కదలికలు కనిపించాయి. అది చూసి బంధుమిత్రులు ఆశ్చర్యంతో ఆయన దగ్గర కూర్చుని కేకలు వేశారు. షణ్ముగం మెల్లగా మెలకువ వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. చనిపోయారని భావించి నివాళులర్పించేందుకు ఊరు బయటి నుంచి వచ్చిన వారు బతికున్న వ్యక్తి యోగక్షేమాలు విచారించి వెనుదిరిగారు.
ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.