16 ఏళ్ల బాలిక నుంచి అండాల సేకరణ.. నాలుగు ఆస్పత్రులపై చర్యలు

4 Tamil Nadu Hospitals Ordered Shut Over Alleged Sale Of Girl's Eggs. తమిళనాడు రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. అక్రమంగా బాలిక అండాలు అమ్ముతున్న ఫెర్టిలిటీ ఆస్పత్రుల బాగోతం

By అంజి  Published on  14 July 2022 10:24 AM GMT
16 ఏళ్ల బాలిక నుంచి అండాల సేకరణ.. నాలుగు ఆస్పత్రులపై చర్యలు

తమిళనాడు రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. అక్రమంగా బాలిక అండాలు అమ్ముతున్న ఫెర్టిలిటీ ఆస్పత్రుల బాగోతం బట్టబయలైంది. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి... వెంటనే నాలుగు ఆస్పత్రులను శాశ్వతం మూసివేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ఫెర్టిలిటీ కేంద్రాలు రూల్స్‌కు విరుద్ధంగా 16 ఏళ్ల బాలిక నుంచి అండాలు సేకరిస్తున్నాయి. అపరిపక్వ అండాల అమ్మకంపై బాలికను ఆమె తల్లి బలవంతం చేసింది. ఇప్పటికే ఎనిమిది సార్లు బాలిక నుంచి అండాలు సేకరించారు. దీని కోసం బాలిక ఆధార్‌ కార్డును ఫోర్జరీ చేయడంతో పాటు, బాలికకు పెళ్లి అయినట్లుగా, అండం దానం కోసం భర్త అనుమతించినట్లుగా ఫేక్ పేపర్లను సృష్టించారు.

ఈ అండాల సేకరణ స్కామ్‌పై ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ ఆగ్రహంగా స్పందించారు. ఫెర్టిలిటీ ఆస్పత్రులు అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ యాక్ట్‌ను తుంగలో తొక్కాయని ఆరోపించారు. రూల్స్‌ ప్రకారం.. పిల్లలున్న 21 - 35 ఏళ్ల వయస్సు మహిళలు ఒక్కసారి మాత్రమే అండ కణాలు దానం చేయడానికి అనుమతి ఉందని చెప్పారు. అయితే దీనికి విరుద్ధంగా తల్లి బలవంతం మీద 16 ఏళ్ల బాలిక నుంచి పలుసార్లు అండాలను సేకరించారని తెలిపారు. కాగా, విచారణ కమిటీ సిఫార్సు మేరకు ఆయా ఆసుపత్రులతోపాటు సంబంధిత వైద్యులకు రూ.50 లక్షల జరిమానా, ఏఆర్‌టీ చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.

నాలుగు ఆస్పత్రులను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించిన మంత్రి.. చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెండు వారాల సమయం ఇచ్చారు. అలాగే ఆధార్‌, పోక్సో చట్టాల కింద కూడా ఆ నాలుగు ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించామని తెలిపారు. మరో రెండు ఆసుపత్రులు రాష్ట్ర ఆరోగ్య బీమా పథకం కింద ఎంప్యానెల్‌మెంట్‌ను కోల్పోతాయని మంత్రి చెప్పారు. అలాగే ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న ఏపీ, కేరళకు చెందిన ఒక్కో ఆసుపత్రిపై చర్యలకు సిఫార్సు చేస్తామని వెల్లడించారు.

Next Story