అందుకేగా బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది..!

Silicon Valley Of India. సైలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటే చాలు టక్కున గుర్తుకు వచ్చే పేరు బెంగళూరు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jan 2021 11:30 AM GMT
అందుకేగా బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది..!

సైలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటే చాలు టక్కున గుర్తుకు వచ్చే పేరు బెంగళూరు. ఎందుకంటే బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీలు.. బెంగళూరులో ఐటీ కంపెనీలకు ఉన్న పేరు దేశంలో మరే నగరానికి లేదు. ఇప్పటికే ప్రపంచ ఐటీ రేసులో దూసుకుపోతోంది. తాజాగా మరో రికార్డును అందుకుంది బెంగళూరు. ఐటీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న నగరాల్లో ప్రపంచంలోనే బెంగళూరు మొదటి స్థానాన్ని సంపాదించింది.

ప్రపంచ ఐటీ నగరాల అభివృద్ధిపై లండన్ అండ్ పార్ట్ నర్స్– ద మేయర్ ఆఫ్ లండన్, డీల్ రూమ్ అనే సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో బెంగళూరుకు ప్రథమ స్థానాన్ని ఇచ్చాయి. 2016 నుంచి 2020 వరకు (నాలుగేళ్లలో) బెంగళూరులో ఐటీ పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగాయని తాజాగా నివేదికలో తెలుస్తోంది. 2016లో 130 కోట్ల డాలర్లు(సుమారు రూ.9,494 కోట్లు)గా ఉన్న పెట్టుబడులు 2020 నాటికి 720 కోట్ల డాలర్లకు (సుమారు రూ.52,590 కోట్లు) పెరిగాయంటే బెంగళూరు ఐటీ విభాగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జాబితాలో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆరో స్థానాన్ని సంపాదించింది. నాలుగేళ్లలో 1.7 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. 70 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,112 కోట్లు) నుంచి 120 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8,764 కోట్లు) పెట్టుబడులు పెరిగాయి. ఈ జాబితాలో లండన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2016 నుంచి 2020 వరకు మూడు రెట్ల వృద్ధిని నమోదు చేసింది. పెట్టుబడులు 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.25,564 కోట్లు) నుంచి 1,050 కోట్ల డాలర్లకు (సుమారు రూ.76,692 కోట్లు) పెరిగాయి.

వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడుల్లోనూ బెంగళూరు టాప్ టెన్ లో నిలిచింది. ఆరో ర్యాంకును దక్కించుకుంది. ఈ జాబితాలో బీజింగ్, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్ లు బెంగళూరు కన్నా ముందున్నాయి.

Next Story
Share it