హోం క్వారంటైన్‌లో దాదా.. ఎందుకంటే..?
By తోట వంశీ కుమార్ Published on 16 July 2020 6:40 AM GMTభారత మాజీ కెప్టెన్, బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అతడి సోదరుడు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(సీఏబీ) జాయింట్ సెక్రటరీ స్నేహాశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడమే అందుకు కారణం.'స్నేహాశీష్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయగా.. అతడికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బెల్లె వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు' అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. దీంతో గంగూలీ హోం క్వారంటైన్‌లోకి వెళ్లాడని.. కొద్ది రోజులు ఇంట్లోనే గంగూలీ ఉండనున్నట్లు అతడి సన్నిహితులు వెల్లడించారు.
కాగా.. గత నెల 20న స్నేహాశీష్ భార్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అతనికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. కానీ క్యాబ్ సెక్రటరీగా పనిచేస్తున్న స్నేహాశీష్ ఆ వార్తల్ని ఖండించాడు. క్యాబ్ కూడా తమ సెక్రటరీ ఆరోగ్యంగా ఉన్నాడని.. అతను రోజూ ఆఫీస్‌కి వస్తున్నట్లు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో కరోనా విజృంభిస్తోంది. 32,838 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఈడెన్ గార్డెన్ క్రికెట్ మైదానాన్ని క్వారంటైన్‌గా ఉపయోగించుకుంటామని క్యాబ్‌ను కోరింది.