విలన్ పేరు ఎందుకు పెట్టారు.. అని ఆ కొడుకు అడగడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2020 9:28 AM GMTరఘువరన్ బీటెక్ సినిమా చూసారు కదా.. ఆ సినిమాలో ధనుష్ పాత్ర పేరు రఘువరన్.. హీరో పేరు తమ్ముడికి పెట్టావు, విలన్ పేరు నాకు పెట్టావు అని ఒక సీన్ లో అడిగేస్తాడు. సినిమాల్లో సోనూ సూద్ కూడా విలనే.. ఇప్పుడు ఓ తల్లి తన కొడుకుకు సోనూ సూద్ అని పేరు పెట్టింది. కానీ ఆ కొడుకు మాత్రం తనకు విలన్ పేరు పెట్టావు అని తల్లిని అడగడు. ఎందుకు అంటే సోనూ సూద్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హీరో. ఎంతో మంది వలస కూలీలను గత కొద్దిరోజులుగా గమ్య స్థానాలకు చేరుస్తున్నాడు. అలా గర్భవతి అయిన ఓ వలస కార్మికురాలిని కూడా సొంత ఊరికి పంపించాడు సోనూ సూద్. ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. దీంతో ఆమె తన కొడుకుకు సోనూ సూద్ అనే పేరును పెట్టింది.
అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో సోనూ సూద్ ఈ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. గర్భంతో ఉన్న మహిళను వారి స్వస్థలానికి పంపానని.. ఆ మహిళకు మగబిడ్డ పుట్టగా సోనూసూద్ అని పేరు పెట్టిందని చెప్పాడు. ఇంటి పేరుని చివరికి చేర్చి సోనూ సూద్ శ్రీ వాస్తవ అని మహిళ పెట్టిందని చెప్పుకొచ్చాడు.
ఇప్పటిదాకా కేవలం బస్సుల్లోనే తన సొంత ఖర్చుతో వలస కార్మికులను సొంత ఊళ్లకు పంపిన సోనూ సూద్ ఇప్పుడు ఏకంగా ప్రత్యేక విమానంలో గమ్య స్థానాలకు చేర్చాడు. చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా 151 మంది మహిళా కూలీలని వారి సొంత ఊర్లకి పంపారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కి చెందిన మహిళా కూలీలు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఇళ్ళకి వెళ్ళేందుకు సిద్ధపడ్డారు. కొచ్చి నుండి భువనేశ్వర్ వెళ్లేందుకు రవాణా వ్యవస్థ సరిగా లేని పరిస్థితులలో ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా వారందరిని స్వస్థలాలకి పంపారు. కేఐటీఈఎక్స్ గార్మెంట్స్ లో పని చేసే 151 మందితో పాటు మరో కంపెనీకి చెందిన 9 మందిని కూడా అదే ఫ్లైట్‌లో పంపారు.