కూలిపోయిన ఇల్లు కొత్తదవుతుంది..కన్నీళ్లు తుడుచుకో చెల్లి: సోనూసూద్‌

By సుభాష్  Published on  20 Aug 2020 6:44 PM IST
కూలిపోయిన ఇల్లు కొత్తదవుతుంది..కన్నీళ్లు తుడుచుకో చెల్లి: సోనూసూద్‌

కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తూ తనవంతు సహాయం చేస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మందికి తనకు తోచిన విధంగా సాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సోనూసూద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఎంతో మంది ధనికులున్నా.. సోనూసూద్‌ లాంటి వ్యక్తి పేదలకు అండగా నిలుస్తూ వారి గుండెల్లో నిలిచిపోతున్నారు.

సోనూసూద్‌ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పటి వరకు ఎందరినో ఆదుకున్న సోనుసూద్‌.. తాజాగా వరదలతో ఇల్లు కూలిపోయిన బాలికకు బాసటగా నిలిచారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు అండగా నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్‌, బస్తర్‌లోని అంజలి అనే బాలిక ఇళ్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు తన పుస్తకాలు కూడా తడిచి ముద్దయ్యాయి. దీంతో తన బాలిక కన్నీరు మున్నీరైంది.

ఇక ఈ దృశ్యాన్ని ముఖేష్ చంద్రకర్‌ అనే జర్నలిస్టు వీడియో తీసి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి సోను సూద్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ట్విట్టర్‌ ద్వారా స్పందించిన సోనూసూద్‌ 'కన్నీళ్లు తుడుచుకో చెల్లి.. కూలిపోయిన ఇళ్లు కొత్తదవుతుంది.. పుస్తకాలు కూడా కొత్తవవుతాయి' అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వీడియోపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగెల్‌ సైతం బాలిక కుటుంబానికి సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక బుధవారం జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే అంజలి కుటుంబాన్ని పరామర్శించి ఇంటి నిర్మాణం కోసం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.



Next Story