అమిత్ షా రాజీనామా చేయాలి
By Newsmeter.Network Published on 26 Feb 2020 3:24 PM IST
దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు, హింసపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. మూడు రోజుల ఆందోళనల్లో 20 మంది చనిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ భేటీలో ఢిల్లీలో పరిస్థితిపై సమీక్షించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. ఈ ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఢిల్లీ సమీపంలో గత మూడు రోజులుగా చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది మృతి చెందగా.. వందలాది మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బుధవారం రంగంలోకి దిగిన పారా మిలటరీ బలగాలు పలు చోట్ల కవాతు నిర్వహించాయి. డ్రోన్ కెమరెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ప్రస్తుతం 35 కంపెనీల పారా మిలటరీ బలగాలు భద్రతను చూస్తుండగా.. దీన్ని 45 వరకు పెంచాలని కేంద్రహోంశాఖ నిర్ణయించింది.