దేశవ్యాప్తంగా కనువిందు చేసిన సప్త వర్ణశోభిత సూర్యగ్రహణం

By Newsmeter.Network  Published on  26 Dec 2019 5:35 AM GMT
దేశవ్యాప్తంగా కనువిందు చేసిన సప్త వర్ణశోభిత సూర్యగ్రహణం

ముఖ్యాంశాలు

  • ''కంకణాకార కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం''
  • సప్తవర్ణాల్లో కనువిందు చేసిన సూర్యగ్రహణం

సుమారు పదేళ్ల తర్వాత భారతదేశంలో కంకణాకార కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఉదయం 8.14 గంటల నుంచి 11.24 గంటల వరకూ అంటే మూడుగంటల పద్నాలుగు నిమిషాల పాటు ఏర్పడే ఈ సంపూర్ణ సూర్య గ్రహణం దక్షిణాది రాష్ర్టాల్లో స్పష్టంగా, ఉత్తరాది రాష్ర్టాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. సప్త వర్ణాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం కనువిందు చేసింది. పసిడి, వెండి, కాషాయం, నీలం, స్కైబ్లూ, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో సప్తవర్ణ శోభితంగా ఏర్పడిన సూర్యగ్రహణాన్ని పిల్లలు, పెద్దలు అంతా ఎక్స్ రే, స్పెషల్ లెన్స్, స్పేస్ సెంటర్ల ద్వారా వీక్షించారు. సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద జన విజ్ఞాన వేదిక, సోషల్ ఫర్ సైన్స్ సెంటర్ సభ్యులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సూర్యగ్రహణంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు జనవిజ్ఞాన వేదిక శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లో పాక్షిక సూర్య గ్రహణం కనిపించింది. 35 శాతం సూర్యుడిని చంద్రుడు కమ్మేసిన దృశ్యాలు కనువిందు చేశాయి. . పాక్షిక సూర్య గ్రహణంతో ఉదయం 10 గంటల వరకూ నగరంలో సూర్యకాంతి కనబడలేదు.

ఈ గ్రహణం మూలానక్షత్రంలో ఏర్పడటం వల్ల ధనస్సు రాశి వారు ఈ గ్రహణాన్ని పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని చూడకూడదని వేద పండితులు ముందునుంచి చెబుతున్న మాట. అలాగే గర్భిణీ స్ర్తీలు గ్రహణాన్ని చూడరాదని, గ్రహణ సమయంలో గర్భిణులు బయటికి వస్తే గ్రహణ సమయంలో సూర్యకాంతి ద్వారా వచ్చే కిరణాలు గర్భంపై పడి పుట్టే పిల్లలు ఏదొక లోపంతో పుడతారని పూర్వకాలం నుంచి పండితులు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి సంపూర్ణ కంకణాకార కేతుగ్రస్త సూర్యగ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత వస్తుందని పండితులు చెబుతున్నారు. సుమారుగా ఒక ఏడాదిలో 6-7 సూర్య గ్రహణాలు ఏర్పడినా వాటిలో సంపూర్ణ సూర్య గ్రహణాలు చాలా తక్కువగా ఉంటాయట. దుబాయ్, త్రివేండ్రం, తమిళనాడు, ముంబై తదితర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి.

సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశులవారికి దోషం ఏర్పడుతుందని, ఫలితంగా వారు ఇబ్బందుల పాలవుతారని పండితులు చెప్తుంటే..నాస్తికులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. రాశులు, జాతకాలు అంతా ఫేక్ అని, సైన్స్ పరంగా ఏర్పడే సూర్య గ్రహణానికి, జాతకాలని ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేస్తున్నారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే అది విషంతో సమానమన్న పండితుల మాటల్ని తీసిపారేస్తున్నారు. తిండి కూడా తినవద్దని సైన్స్ చెప్పలేదని వాదిస్తున్నారు. గతేడాది సూర్య గ్రహణం ఏర్పడినప్పుడు కూడా పండితులు ఇలాగే హెచ్చరికలు చేశారని, అప్పుడు గ్రహణ సమయంలో ఆహారం తీసుకున్న మాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని నాస్తికులు చెప్తున్నారు.

నేను గ్రహణాన్ని చూడలేకపోయా..ప్రధాని నరేంద్ర మోడీ

''దేశవ్యాప్తంగా ఏర్పడిన సూర్యగ్రహణాన్ని దాదాపు అందరూ వీక్షించి ఉంటారు. కానీ నేను గ్రహణాన్ని చూడలేకపోయాను. గ్రహణాన్ని వీక్షించే సమయంలో మబ్బులు కమ్ముకోవడంతో నాకు ఆ అవకాశం లభించలేదు..కానీ కోజికోడ్ వద్ద పాక్షికంగా గ్రహణం కనిపించింది. అలాగే ఆన్ లైన్ లో వచ్చిన live ద్వారా గ్రహణాన్ని వీక్షించా'' అని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.రెండు మినహా..దేశ వ్యాప్తంగా మూతపడిన ఆలయాలు

తెలుగు రాష్ర్టాల్లో రెండు ఆలయాలు మినహా మిగతా ప్రధాన ఆలయాలన్నింటినీ అర్చకులు గ్రహణ సమయంలో మూసివేశారు. గ్రహణం పూర్తయ్యాక ఆలయాల సంప్రోక్షణలు అయ్యాక, తిరిగి ఆలయాలను తీసి, భక్తులను స్వామివార్ల, అమ్మవార్ల దర్శనాలకు అనుమతిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంలో అర్చకులు గ్రహణ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, జపాలు నిర్వహించారు. ఈ పూజా తతంగాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇదే ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతిక అమ్మవారి ఆలయం కూడా ఇక్కడే ఉండటం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. అలాగే శ్రీ కాళహస్తీశ్వరాలయాన్ని కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంచారు. గ్రహణ సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహు, కేతు దోషాలున్నవారు, ఈ గ్రహణం వల్ల దోషం ఏర్పడిన వారు ప్రత్యేక పూజలు చేయించుకునేందుకు ఆలయానికి బారులు తీరారు.

మొత్తానికి ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే అవకాశం అందరికీ దక్కదంటున్నారు పండితులు. ఈ అద్భుతాన్ని చూసేటపుడు కంటికి ఎటువంటి రక్షణ లేకుండా చూస్తే ప్రమాదకరమని చెప్పారు. గ్రహణ సమయంలో సూర్యగోళాన్ని చంద్రుడు దాదాపు 97% కప్పేయడంతో భానుడి అంచులు ఉంగరం ఆకారంలో ప్రకాశిస్తూ కనిపించాయి. ఈ దృశ్యాన్ని సైంటిస్టులు RING OF FIRE (రింగ్ ఆఫ్ ఫైర్) గా చెప్తున్నారు.Next Story