ఏపీలో ఆరు వారాలు ఎన్నికల ప్రక్రియ నిలిపివేత

By Newsmeter.Network  Published on  15 March 2020 5:40 AM GMT
ఏపీలో ఆరు వారాలు ఎన్నికల ప్రక్రియ నిలిపివేత

ముఖ్యాంశాలు

  • సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం
  • ఏకగ్రీవంగా ఎన్నికైన వారు యథావిధిగా కొనసాగుతారు
  • ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదు
  • ఎన్నికల నియమావళి యథావిధిగా కొనసాగుతుంది
  • ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కరోనా వైరస్‌ ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో పాటు ఏపీలోనూ కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌ కుమార్‌ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవంగా ఎన్నికైనవారు అలాగే కొనసాగుతారని రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అన్ని నోటిఫికేషన్లు సవరిస్తామని తెలిపారు. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయటం జరిగిందని అన్నారు.

ఎన్నికల నియమావళి యధాతథంగా ఉంటుందని తెలిపారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రభుత్వం పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిందిగా రమేష్‌ కుమార్‌ ఆదేశించారు. నామినేషన్లను వేసిన వారిని భయపెట్టడం నేరమని తెలిపారు. ఇది అనివార్య పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమేనని తెలిపారు. ఆరు వారాల తరువాత సాధారణ పరిస్థితులు ఏర్పడితే సమీక్షించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని, ఆ తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వెల్లడించారు.

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేష్‌కుమార్‌ అన్నారు. కొన్ని చోట్ల బెదిరింపులకు దిగడం దారుణమని పేర్కొన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని రమేష్‌ కుమార్‌ అన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వేరే అధికారులను నియమించాలని ఆదేశించామని అన్నారు. మాచర్ల సీఐ పై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు.

Next Story
Share it