దేశవ్యాప్తంగా మరోసారి స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా తాజాగా ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు స్వైన్‌ఫ్లూ వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే అధ్యక్షతన అత్యవసరం సమావేశం జరగనుంది. స్వైన్‌ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ విషయాన్ని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. జడ్జీలకు స్వైన్‌ఫ్లూ టీకాలు వేయించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఓ గర్భిణి మృతి చెందిన సంగతి తెలిసిందే.

కాగా జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ కూడా ఇవాళ ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక వైపు కరోనా వైరస్‌ కేసులు.. మరోవైపు స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడుతుండడం తీవ్ర కలకవరానికి గురి చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీప్‌కు చెందిన షహనాజ్‌కు ఇటీవల స్వైన్‌ఫ్లూ సోకింది. తొలుత ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆతర్వాత పరిస్థితి విషమించడంతో గత మంగళవారం నాడు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె సోమవారం రోజున వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు కర్నాటకలో 157 హెచ్‌1ఎన్‌1 కేసులు నమోదు అయ్యాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.