సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్‌..

By Newsmeter.Network  Published on  2 April 2020 11:14 AM GMT
సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం.. ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్‌..

తెలంగాణ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 9 మంది మృతిచెందారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరు పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో జిల్లా వాసుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. సంగారెడ్డి టౌన్‌లో ఇద్దరు, సంగారెడ్డి శివారులోని అంగడిపేట గ్రామంలో ఇద్దరు, కొండాపూర్‌, జహీరాబాద్‌ మండలాల్లో ఒక్కొక్కరికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు జిల్లా అధికారులు వెల్లడించారు. బాధితుల్లో ఐదుగురు 40ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి హుటాహుటీన సంగారెడ్డికి వెళ్లారు. కలెక్టర్‌తో సమావేశమై కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Also Read :దేశంలో తొలి క్వారంటైన్‌ బర్త్‌.. ఎక్కడంటే..?

ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి చెందిన వారంతా ఇటీవల ఢిల్లిలో ఓ మత సంస్థ నిర్వహించిన సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన వారే కావడంతో స్థానికుల్లో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరుగురు బాధితుల కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. వీరు ఢిల్లి నుంచి వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడికి వెళ్లారో అనే విషయాలపై ఆరాతీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్‌ చేస్తున్నారు.

Also Read :లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కాల్చేయండి..

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించి ప్రజలను ఇండ్లకే పరిమితం చేసింది. మొన్నటి వరకు అదుపులోనే ఉన్న కరోనా వ్యాప్తి.. ఢిల్లి ఘటనతో ఒక్కసారిగా తెలంగాణలో పాజిటివ్‌ కేసులు పెరగడం ప్రారంభమయ్యాయి. మార్చి మూడవ వారంలో ఢిల్లిలోని మర్కజ్‌లో ఓ మత సంస్థ నిర్వహించిన సమావేశానికి తెలంగాణ నుంచి వందలాది మంది వెళ్లారు. వారంతా తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఢిల్లిలో జరిగిన సమావేశంలో పలువురికి కరోనా వైరస్‌ సోకడంతో తెలంగాణ నుంచి వెళ్లిన వారికి కరోనా సోకింది. ఇప్పుడు వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని వస్తుంది. ఫలింగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ ఒక్కరూ ఇండ్లకే పరిమితం కావాలని సూచించింది.

Next Story
Share it