లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కాల్చేయండి..

By Newsmeter.Network  Published on  2 April 2020 10:37 AM GMT
లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కాల్చేయండి..

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ మహమ్మారి నుంచి తప్పించుకొనేందుకు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే అన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించాయి. ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టడి చేస్తున్నాయి. ఫిలిప్పిన్స్‌లోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. అయినా పలువురు ఇండ్ల నుంచి బయటకొస్తూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పలువురు పోలీసులపై దాడికి దిగుతున్నారు. దీంతో ఆ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యుటేర్టేకి కోపమొచ్చింది. ఎన్ని చెప్పినా మీరు వినరా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ఎవరైనా కనిపిస్తే నిర్దాక్షణ్యంగా కాల్చిపారేయడం అంటూ ఆదేశాలిచ్చారు.ఎవరైనా సంకోచించొద్దు. మీపై దాడిచేసే పరిస్థితే తలెత్తితే వెంటనే కాల్చిపారేయండి అంటూ పోలీసులను, ఆర్మీని ఆదేశించారు.

Also Read :నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?

ఫిలిప్పిన్స్‌లో కరోనా వైరస్‌ మహమ్మారితో ఇప్పటికే 2311 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 96 మంది మృతి చెందారు. దీంతో మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఫిలిప్పిన్స్‌లో 16శాతం జనాభా పేదరికంలో మగ్గుతోంది. లాక్‌డౌన్‌తో వారు ఇబ్బందులు పడకుండా చూడటం కోసం ఆ దేశ అధ్యక్షుడు నాలుగు బిలియన్‌ డాలర్లు కేటాయించారు. 108 కోట్ల మందికి ఈ మొత్తాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ అర్హుల జాబితా రూపొందిస్తున్న కారణంతో ఇప్పటికీ పేదలకు సాయం అందలేదు.

Also Read :దేశంలో తొలి క్వారంటైన్‌ బర్త్‌.. ఎక్కడంటే..?

ఇదే సమయంలో వామపక్షాల మద్దతుతో కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనల వెనుక వామపక్షాలు ఉన్నారని అనుమానిస్తున్న అధ్యక్షుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ప్రభుత్వంలో లేరనే విషయాన్ని గుర్తించుకోండని, ఇబ్బందులు కలగజేయొద్దు అంటూ హితవు పలికారు. లేదంటే కోవిడ్‌ మహమ్మారి అదుపులోకి వచ్చేంత వరకు మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు, ఆర్మీకి ఆదేశాలు ఇవ్వటం జరుగుతుందని రోడ్రిగో హెచ్చరించారు. అయినా ఆందోళనలు ఆగకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రోడ్రిగో పోలీసులు, ఆర్మీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ను పాటించని వారిని, పోలీసులపై ఘర్షణలకు దిగేవారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయండంటూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రోడ్రిగో ఆదేశాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story