గాడితప్పిన విద్యావ్యవస్థ పై ఒక 'లా' విద్యార్థి న్యాయ సమరమే 'సిరా'
By న్యూస్‌మీటర్ తెలుగు
కథలో మొదటి భాగం మనకందరికీ తెలిసిందే..
మన పక్కింట్లో ఒక ఇంటర్మీడియేట్ విద్యార్థి ఉంటాడు.. ఇష్టం లేని చదువును తల్లిదండ్రుల బలవంతం మీద గుదిబండలా నెత్తిన పెట్టుకుని మోస్తూ ఉంటాడు. కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చి కొనేస్తుంది కాలేజీ యాజమాన్యం. మీడియా చూసీ చూడనట్టు వదిలేస్తుంది. ప్రభుత్వం ఇదేమీ పెద్ద సమస్య కాదన్నట్టు వ్యవహరిస్తుంది. మానవహక్కుల సంఘాల ఒత్తిడి మీద ఒక కమిషన్ ని ఏర్పాటు చేస్తుంది. అక్కడితో సమస్యకు తిలోదకాలిచ్చేస్తారంతా! ఇరవయ్యేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వందలాది సంఘటనలు జరిగాయి ఇలాంటివి.
కథలో రెండో భాగం..
రామ్ అనే లా విద్యార్థి ఈ సమస్యను ఎదుర్కోవాలని నిశ్చయించుకుంటాడు. కాలేజీని రోడ్డుకీడుస్తాడు. కానీ, అతనికి ఎదురుగా దేశంలోని అత్యున్నతమైన న్యాయవాదుల్లో ఒకరైన మనోహరమూర్తి వాదించడానికి ముందుకొస్తారు. తన గురువు, దైవం అయిన ఆయన మీద రామ్ ఫైట్ చేయాల్సింది. అడుగడుగునా మూర్తి తన అనుభవాన్నంతా రంగరించి పెడుతున్న పరీక్షలను ఎదుర్కొంటూ ఎలా విజయం సాధించాడు? ఎలా విద్యావ్యవస్థను, దాని దశను దిశను మార్చి చరిత్ర సృష్టించాడన్నదే ఈ కథ.