జగన్‌ ప్రభుత్వంపై అశోక్‌ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

By సుభాష్  Published on  7 March 2020 9:03 AM GMT
జగన్‌ ప్రభుత్వంపై అశోక్‌ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

మాన్సాస్‌ ట్రస్ట్‌ వివాదంపై మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ ప్రభుత్వ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా సున్నితమైన వ్యవహారమని, ఒక మతానికి చెందిన వారిని తీసుకొచ్చి మన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా నియమిస్తే సమస్యలు ఉంటాయని, సర్కార్‌ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన జీవోను బయటపెట్టలేదని, ఇది ఎవరి నిర్ణయమో అర్థం కావడం లేదన్నారు. జగన్‌ సర్కార్‌ వైఖరిని చూస్తే వింతగా అనిపిస్తుందని వ్యాఖ్యనించారు.

కాగా, సింహాచలంతో పాటు వందకు పైగా ఆలయాలున్నాయి. వాటికి ఎంతో విలువైన భూములు కూడా ఉన్నాయి. ఆ భూములు దేవుడికే చెందాలని అన్నారు. దాతల భూములు ఆలయాలకే చెందుతాయని అన్నారు.

రాజు కుటుంబానికి కొన్ని ఆచారాలున్నాయి

రాజు కుటుంబానికి కొన్నిఆచారాలున్నాయని అశోక్‌ గజపతిరాజు అన్నారు. ఇప్పటి వరకు జీవోను ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సమంజసం కాదన్నారు. జీవోబయటకు రాకుండా రహస్యంగా ఉంచారని ఆరోపించారు. ఒక వేళ జీవోను బయట పెట్టకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అలాగే రాజధాని తరలింపు విషయంలో తాము కూడా బాధితులుగా మారామని అన్నారు. ఒక వేళ మన్సాన్‌ చైర్మన్‌గా తాను తప్పుచేసి ఉంటే తనకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలి కదా..ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దొడ్డి దారిలో ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు.

కాగా, తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ట్రస్ట్‌ చైర్ పర్సన్‌గా ఆనందగజపతిరాజు కుమార్తె అయిన సంచయిత గజపతిరాజును నియమించింది. 1958లో దివంగత పివిజి రాజు మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (మాన్సాస్‌)ను నెలకొల్పారు.

విద్యావ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మాన్సాన్‌ విద్యాసంస్థలను నడుపుతోంది. అయితే 1958లో పివిజి రాజు వ్యవస్థాపక చైర్మన్‌ ఉండగా, ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజులు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక 1994లో పివిజి రాజు మృతి చెందిన తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌గా ఎంపికయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌గజపతి రాజు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత కు మాన్సాస్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఈ వివాదం తలెత్తింది.

Next Story
Share it