దేశంలోని ప్రసిద్ధ రామాలయాలన్నింటినీ దర్శించుకోవాలనుకుంటున్న వారికి రైల్వే శాఖ ఓ అద్భుత అవకాశం కల్పిస్తోంది. మార్చి 28న శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్టు ప్రకటించింది. ఇందులో ప్రయాణించేవారికి రామాయణ కాలం గుర్తొచ్చే విధంగా భక్తి పారవశ్యంతో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు బోగీల లోపల రామాయణ కావ్యానికి ప్రతీక అనే విధంగా అలంకరణ ఉంటుందని, భజనలు వినిపిస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఈ రైలులో ఉన్న 10 బోగీలలో 5 నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీలు కాగా మిగతా 5 త్రై టైర్ ఏసీ బోగీలు. ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ ప్రాతిపదికన టికెట్ల బుకింగ్ పూర్తయ్యిందని, అమ్మకానికి ఉంచిన టికెట్లన్నీ వారం రోజుల్లోనే అమ్ముడయ్యాయని ఐఆర్సీటీసీ వివరించింది. 16 రాత్రులతో కూడిన 17 రోజుల టూర్‌లో రాముడికి సంబంధించిన అన్ని ప్రాంతాలను ‘రామాయణ సర్క్యూట్ ఆఫ్ ఇండియా’ పేరుతో సందర్శించే అవకాశం ఉంటుంది.

Shri Ramayana express train

అయోధ్యలోని రామ జన్మభూమి, హనుమాన్ గార్హీ, సీతామార్తీ (బిహార్)లోని సీతామాత మందిరం, నందిగ్రామ్‌లోని భారత్ మందిర్, నేపాల్‌లోని జనక్‌పూర్, వారణాసిలోని తులసీ మానస్ మందిర్, సంకట్ మోచన్ మందిర్, ఉత్తరప్రదేశ్ సీతామార్తీలోని సీత సమాహిత్ స్థల్, ప్రయాగ్‌లోని త్రివేణి సంగం, హనుమాన్ మందిర్, భరద్వాజ్ ఆశ్రమం, శృంగ్వేర్‌పూర్‌లోని శృంగీ రుషి మందిర్, చిత్రకూట్‌లోని రాంఘాట్, సతీఅనసూయ మందిర్, నాసిక్‌లోని పంచవటి, హంపీలోని అంజనాద్రి, హనుమాన్ జన్మస్థల్, రామేశ్వరంలోని జ్యోతిర్లింగ శివ మందిర్ వంటి ప్రధాన ప్రాంతాలను టూరిస్టులు సందర్శించుకోచ్చు.

Shri Ramayana express train

అయితే ఈ రైలులో పూర్తిస్థాయి శాఖాహార భోజనాన్ని మాత్రమే ఇస్తారు. స్లీపర్ క్లాస్ బుకింగ్ చేసుకున్నవారికి ధర్మశాలల్లోను, ఏసీ టికెట్ ఉన్నవారికి హోటళ్లలోనూ బసను ఏర్పాటు చేస్తారు. సైట్ సీయింగ్‌కు అన్నిరకాల టికెట్లు ఉన్నవారికి నాన్ ఏసీ బస్సుల్లో తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ నాన్ ఏసీ వారికి 16,065 రూపాయలు, ఏసీ వారికి 26,775 రూపాయలుగా ఖరారు చేశారు. ఒకవేళ రామాయణంతో సంబంధం ఉన్న శ్రీలంకకు వెళ్లాలనుకుంటే అదనపు మొత్తాన్ని చెల్లించి ప్యాకేజీలను తీసుకునే అవకాశం ఉంది.

Shri Ramayana express train

ఏప్రిల్ 11న రామాయణ ఎక్స్‌ప్రెస్ చేరుకుంటుంది. ఆ వెంటనే శ్రీలంకకు మొదలవుతుంది. మూడు రాత్రులు శ్రీలంకలో నివాసం ఉండేందుకు వీలుగా రూపొందించిన ఈ ప్యాకేజీలో క్యాండీ, నువారా ఎలియా, నెగోంబోలో బస చేయవచ్చు. మనిషికి 37,800 రూపాయలు వసూలు చేసే ఈ టూర్‌లో సీతామాత మందిర్, అశోక్ వాటిక, విభూషణ్ టెంపుల్‌తోపాటు మునేనశ్వరంలోని ప్రఖ్యాత శివాలయం వంటి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ రైలుకు సంబంధించిన సంవత్సర కాలమానాన్ని వచ్చేవారం విడుదల చేస్తామన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.