శ్రామిక్‌ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి..!

By సుభాష్  Published on  31 May 2020 3:28 AM GMT
శ్రామిక్‌ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి..!

లాక్‌డౌన్‌ తెచ్చిన కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. కరోనా రక్కిసి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వలస కార్మికుల కష్టాలు వర్ణానాతీతం. చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక కొందరు చేసేదేమి లేక కాలినడకన బయలుదేరారు. కాగా, వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరగా, అందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం.. వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది.

అయితే లాక్‌డౌన్‌ నుంచి సడలింపుల తర్వాత వలస కూలీలు రైళ్లలో, ఇతర ప్రైవేటు వాహనాల్లో బయటుదేరారు. వారు ప్రయాణిస్తున్న సమయంలో పలు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో వలస కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇక తాజాగా శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లలో ఇప్పటి వరకూ 80 మంది వలస కార్మికులు మృతి చెందినట్లు రైల్వేశాఖ ద్వారా తెలుస్తోంది. ఇందులో ఒకరు కరోనా వైరస్‌తో మృతి చెందగా, మిగతా వారు అనారోగ్య సమస్యలతో పాటు ఇతర కారణల వల్ల మరణించినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మే 9 నుంచి 27వ తేదీ మధ్య ఈ మరణాలు జరిగినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్ను ఈ మరణాలపై మీడియా ప్రశ్నించగా, ఆయన దాటవేశారు. వీటిపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక వెల్లడిస్తామని తెలిపారు.

Next Story