విజయవంతంగా శౌర్య క్షిపణి ప్రయోగం
By సుభాష్ Published on 3 Oct 2020 2:50 PM ISTభారత రక్షణ రంగంలో ప్రయోగాలు జోరందుకున్నాయి. మరో అణు సామర్థ్య క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల క్రితం ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్‌డీఓ.. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం ఉన్న శౌర్య మిసెల్స్‌ని శనివారం ఒడిశాలోని బాలాసోర్ తీరంలో విజయవంతంగా ప్రయోగించింది.
భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే ఈ క్షిపణికి 800 కి.మీ. దూరంలోని ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్నదని డీఆర్‌డీవో వెల్లడించింది. శౌర్య క్షిపణితో ప్రస్తుతం ఉన్న క్షిపణి వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి చాలా తేలికైనదని, దీన్ని సులువుగా పరీక్షించవచ్చని చెప్పారు. ఆధునీకరించిన ఈ శౌర్య మిసైల్‌ను త్వరలోనే భారత అమ్ముల పొదలో చేరుస్తామన్నారు. వ్యూహాత్మక క్షిపణుల తయారీలో పూర్తి స్వయం స్వావలంబన సాధించే దిశగా ప్రయోగాలు నిర్వహిస్తున్న డీఆర్డీఓ శాస్త్రవేత్తలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర భారత్ స్పూర్తితో ప్రయోగాలను ముమ్మరం చేశారు.