టీడీపీకి షాక్‌.. వైసీపీలోకి బాలయ్య స్నేహితుడు?

By Newsmeter.Network
Published on : 10 March 2020 12:35 PM IST

టీడీపీకి షాక్‌..  వైసీపీలోకి బాలయ్య స్నేహితుడు?

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి దెబ్బమీద దెబ్బతగులుతుంది. ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడి అధికార వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వైసీపీలో చేరగా, ఓ మాజీ ఎమ్మెల్యే సైతం జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరికితోడు మరికొందరు టీడీపిని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కీలక నేతలంతా పార్టీని వీడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

ఇదిచాలదన్నట్లు టీడీపీకి మరోషాక్‌ తగలనున్నట్లు తెలుస్తోంది. స్వయాన టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సన్నిహితుడు, ప్రకాశం జిల్లాకు చెందిన నేత బాబూరావుసైతం టీడీపీకి షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు సోషల్‌ మీడియాలోనూ, వాట్సాప్‌ గ్రూపుల్లోనూ విస్తృత ప్రచారం సాగుతుంది. బాబూరావు బాలకృష్ణకు ప్రాణ స్నేహితుడు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచే టీడీపీ అధినేత చంద్రబాబుపై కొంత గుర్రుగా ఉంటూ వస్తున్నాడు.

Also read : సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి డొక్కా మాణిక్య వరప్రసాద్

కనిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన బాబూరావును 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి అవకాశం కల్పించారు. తనకు కనిగిరి స్థానం కేటాయించాలని బాబూరావు పట్టుబట్టినా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో చేసేదేమీలేక దర్శినుంచి పోటీచేసిన బాబూరావు.. ఓటమి పాలయ్యాడు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

అయితే తాజాగా ఆయన పార్టీ మారుతున్నట్లు విస్తృత ప్రచారం సాగుతుంది. ఒకటి రెండు రోజుల్లో సీఎం జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతారని సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో విస్తృత ప్రచారం సాగుతుంది. బాలయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిసైతం టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మరి సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం జరుగుతున్నట్లు బాబూరావు టీడీపీని వీడి బాలయ్యకు, చంద్రబాబుకు షాకిస్తాడా.. లేక టీడీపీలోనే కొనసాగుతాడా అనేది వేచిచూడాల్సిందే.

Next Story