సీనియ‌ర్ న‌టుడు శివాజీ రాజాకు గుండెపోటు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 May 2020 12:47 AM GMT
సీనియ‌ర్ న‌టుడు శివాజీ రాజాకు గుండెపోటు

హైద‌రాబాద్‌ : టాలీవుడ్ సీనియర్ నటుడు, మా అసోషియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా గుండెపోటుకు గుర‌య్యారు. నిన్న రాత్రి ఆయ‌న‌కు ఉన్నట్లుండి బీపీ డౌన్ అయ్యి.. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అత‌న్ని వెంట‌నే స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయ‌న‌కు ఆసుప‌త్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య‌ ప‌రిస్థ‌తి బాగానే ఉంది.

ఈ విషయమై శివాజీ రాజా స్నేహితుడు.. ప్ర‌ముఖ నిర్మాత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఇప్పుడే ఆయనతో మాట్లాడాను.. ఉన్న‌ట్టుండి.. బీపీ డౌన్ అయ్యి హార్ట్ఎటాక్ వ‌చ్చింద‌ని.. స్టంట్ వేస్తారని చెప్పారని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలావుంటే.. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన 'కళ్ళు' అనే నాటిక, చిత్రంతో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా.. ఆ చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు కూడా స్వీకరించాడు.

ఆ త‌ర్వాత‌.. పెళ్ళిసందడి, సిసింద్రీ, ఘటోత్కచుడు, మురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి విజ‌య‌వంత‌మైన‌ సినిమాలలో గుర్తింపు పొందిన పాత్ర‌ల‌లో న‌టించారు. అలాగే.. జెమినీ టీవీలో ప్రసారమైన సూప‌ర్ హిట్ కామెడీ సీరియ‌ల్.. అమృతంలో టైటిల్ రోల్‌ అమృతం పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందారు. ఎన్నో సినిమాల‌లో క‌మెడియ‌న్‌గా అల‌రించిన శివాజీ రాజా.. మొగుడ్స్ పెళ్ళామ్స్ చిత్రంలో హీరోగా కూడా న‌టించారు. కొన్ని రోజులుగా సొంత ఫామ్‌హౌజ్‌లో కూరగాయలు పండిస్తూ.. సినిమా కార్మికులకు ఉచితంగా పంచి పెడుతున్నాడు. అయితే ఉన్నట్లుండి శివాజీకి గుండెపోటు రావడంతో ఇండస్ట్రీ షాక్ గుర‌య్యింది.

Next Story