సహనం.. శిల్పా దాస్‌గుప్తా ఆభరణం..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2020 2:02 PM IST
సహనం.. శిల్పా దాస్‌గుప్తా ఆభరణం..!

సృష్టిలో తల్లి పాత్ర గొప్పది. తల్లిగా స్త్రీకు ఉన్న సహనం ఓర్పు మరెవరికీ ఉండదేమో! అందుకే అవని అమ్మ నేలతల్లీ.. అంటూ భూమాతకు ఎంత గౌరవమిచ్చామో మాతృమూర్తికి అంతే గౌరవమిస్తున్నాం. అలాంటి మనసున్న మంచి తల్లిగా శిల్పా దాస్‌గుప్తా మనకు అగుపిస్తారు.

ఇప్పుడు ఎవరైనా మీ ఆవిడ ఏం చేస్తుందంటే హోమ్‌ మేకర్‌ అంటున్నాం గానీ.. మొదట్లో ఆమెను హౌస్‌వైఫ్‌ అనే పదానికే పరిమితం చేసేశాం. హౌస్‌వైఫ్‌ అంటే ఏం పని చేయదనే అర్థంలోనే అంటుంటాం. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా మగవాళ్లు చేసే ఉద్యోగానికో, మన పిల్లలు స్కూల్‌ చదువులకో అనువైన వాతావరణాన్ని కల్పించడంలో ఇల్లాలు పడే శ్రమ ఎవరి కంటికీ ఆనదు. ఉద్యోగం చేసేవారికి వారానికో రోజు సెలవు, లీవులు ఉంటాయి. మరి హౌస్‌వైఫ్‌ చచ్చినట్టు 365 రోజులు పని చేస్తున్నా పెదాలపై చిరునవ్వు చెదరనీకుండా.. కళ్లల్లో ఆప్యాయత మసక బారకుండా ఉండే శిల్పా దాస్‌గుప్తాను చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి చెందిన డాక్టర్‌ శిల్పాదాస్‌గుప్తా ప్రత్యేక బిడ్డకు ప్రత్యేకమైన తల్లిగా మనకు కనిపిస్తారు. శిల్పా తండ్రి ప్రబోద్‌ చంద్ర చక్రవర్తి రైల్వేలో గార్డుగా పనిచేసేవారు. తల్లి ఉమారాణి చక్రవర్తి మంచి గాయని. తల్లిదండ్రులు గతించినా వారిలోని గుణగణాలను మాత్రం శిల్పాలో తమ ఆనవాళ్లుగా వదలి వెళ్లారు. అందుకే శిల్పా గాయనే కాదు చక్కని వక్త కూడా! తల్లి నుంచి వారసత్వంగా అబ్బిన సుమధుర స్వరంతో శిల్పా వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు ఎన్నో ఇచ్చారు.

డాక్టర్‌ శిల్పాదాస్‌ గుప్తా వైకల్యం ఉన్న తన 28 ఏళ్ళ కుమారుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. తన కుమారుడి పరిస్థితి ఆమెకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పాయి. కుమారుడి వైకల్యం తనను ఎప్పటికీ బాధించలేదు. కానీ చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఆమె గుండెను సూటిగా తాకేవి. గాయాలు చేసేవి. వారు తన కుమారుడిపై, తనపై జాలి చూపడాన్ని శిల్పా సహించలేకపోతోంది. మాకు కావల్సింది జాలి కాదు సాటి మనిషిగా ప్రేమ ప్రదర్శిస్తే చాలు అంటారామె. తను ఏనాడు కుమారుడు శ్రీ కౌస్తవ్‌ గురించి బాధపలేదు. ఏనాడు తన పెదాలపై చిరునవ్వు చెరగనీయలేదు. కౌస్తవ్‌ తల్లి కావడం తన అదృష్టంగా భావిస్తోంది.

కౌస్తవ్‌ ఆస్టియోజెనిసిస్‌ ఇమ్‌పర్‌ఫెక్టా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీన్నే బ్రిటిల్‌ బోన్‌ డిసీజ్‌ అని కూడా అంటారు. కౌస్తవ్‌కు కథక్‌ నృత్యం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే కథక్‌ నేర్చుకుని ప్రదర్శనలిచ్చేవాడు. కానీ తనకు ఈ వ్యాధి ఉందని తేలాక.. డాక్టర్లు కౌస్తవ్‌ ఇక నృత్యం చేయలేదని చెప్పారు. అయితే శిల్పా ఏమాత్రం కుంగిపోలేదు. కౌస్తవ్‌కు పాటలు నేర్పించడం ప్రారంభించారు.

కౌస్తవ్‌కు పాట మరో ప్రాణమైంది. తను నృత్యం చేయలేనని తెలిసినా తల్లి సహకారంతో స్వరాన్ని శ్రుతి చేశాడు. అనగ అనగ రాగమతిశయిల్లుచుండు.. అన్నట్టు సాధన చేయడంతో స్వరం పాటగా మారింది. అంతకాలం తన నృత్యంతో ప్రజలను మెప్పించిన కౌస్తవ్‌ ఇక తన గానంతో మైమరిపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మార్పు కేవలం తల్లి ప్రోద్బలంతోనే సాధ్యమైంది. జీవితంలో సానూకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధించవచ్చని కౌస్తవ్‌ అంటాడు.

'కౌస్తవ్‌ ఆత్మవిశ్వాసం నాకు కొత్త పాఠాలు నేర్పింది. తను జబ్బు వచ్చిందని కుంగిపోలేదు. తన జీవితంలో నృత్యం ఓ లక్ష్యంగా అనుకున్నాడు. అది సాధ్యపడదని తెలుసుకున్నాక మరో లక్ష్యం దిశగా మనసు మార్చుకున్నాడు. వాస్తవాలను స్వీకరించగలడం కూడా సుగుణమే. ఈ సుగుణం నాకు కౌస్తవ్‌ వల్లే అబ్బింది. పైగా తను చాలా సహనంతో ఉంటాడు. విపత్కర పరిస్థితుల్లోనూ ఎలా సహనంగా ఉండవచ్చో నాకు నేర్పిందే కౌస్తవ్‌. తనకు తల్లిగా నేనేంతో సంతోషంగా ఉంటున్నాను..' అంటారు శిల్పా.

మా ఇంట్లో జాలి అనే పదానికి చోటే లేదు. కేవలం ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. నా పెద్ద కుమారుడు వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. అయితే మాకు ఎప్పుడూ తను వీల్‌చైర్‌లోనే ఉంటున్నాడనే భావన వచ్చేది కాదు. ఇంట్లో ఏమాత్రం ప్రతికూలవాతావరణం మేం సృష్టించదలచుకోలేదు. మాది ఉమ్మడి కుటుంబం. కానీ మా పిల్లల కోసం మేం వేరే ఇంటికి మారాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరైన కనీసం షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా మా అబ్బాయి ఎముకలు విరిగిపోయే పరిస్థితి. కేవలం వారికోసమే ప్రత్యేక ఇల్లు మారాల్సి వచ్చింది.' అంటూ వివరించారు శిల్పదాస్‌గుప్తా.

ఇంట్లో ఇలాంటి పరిస్థితులున్నా శిల్పా తన భక్తి భావనలను ఏనాడు వదులుకోలేదు. రోజూ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయడం ఆమెకు అలవాటు. ఈ క్రమంలో కేవలం ఒక నిమిషం 45 సెకన్లలో హనుమాన్‌ చాలీసా పారయణం చేసి అంతర్జాతీయ రికార్డు సృషించారు శిల్పా. 'నాకు ప్రార్థన, భగవదారాధన అంటే ఇష్టం. మన మనసులో చీకాకుల్ని వత్తిళ్ళను ఈ భక్తి భావనే దూరం చేస్తుందని నా నమ్మిక' అంటున్న శిల్పాదాస్‌గుప్తా తన జీవితానుభవాలను చెబుతూ ఏ సందర్భంలో అయినా ఆవేశంతో కాకుండా నెమ్మదిగా అర్థం చేసుకుని ఆలోచించాలి. అది మన జీవన మార్గాన్నే మార్చివేస్తుంది. తొందరపాటు వల్ల అనర్థాలే ఎక్కువ అంటారు. ప్రతి ప్రతికూల పరిస్థితి జీవితంలో ఓ గొప్ప అవకాశాన్ని ఇస్తుందనేది ఆమె అభిప్రాయం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కుంగిపోరాదు…నమ్మకాన్ని వదులుకోరాదు అంటున్న శిల్పాదాస్‌ గుప్తా జీవితం ఎందరికో ఆదర్శం.

Next Story