తన ఇంటిని ప్లాస్టిక్ కవర్లతో కప్పేసిన షారుఖ్ ఖాన్.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2020 9:27 AM GMT
తన ఇంటిని ప్లాస్టిక్ కవర్లతో కప్పేసిన షారుఖ్ ఖాన్.. ఎందుకంటే..?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ ఇంటి గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముంబైలోని షారుఖ్‌ఖాన్‌ బంగళా 'మన్నత్' ను ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచడమే..!

షారుఖ్ ఖాన్ మన్నత్ బాల్కనీలను ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. పలు సామాజిక మాధ్యమాలు, ఫ్యాన్ క్లబ్ లు ఆ ఫోటోలను పోస్టు చేశారు. ఇంతకూ షారుఖ్ ఖాన్ ఎందుకు ఇలా చేశాడా అని ఆరా తీస్తున్నారు.

రుతుపవనాల కారణంగానే షారుఖ్ ఖాన్ తన ఇంటిని ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచాడని.. ప్రతి ఏడాది భారీగా వర్షాలు పడే అవకాశమున్న సమయంలో ఇలా చేస్తూ ఉంటారని కొందరు తెలిపారు. షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్, ముగ్గురు పిల్లలు సుహానా, ఆర్యన్, అబ్రామ్ తో కలిసి ఉంటున్నారు. సుహానా, ఆర్యన్ ను ఇతర దేశాల్లో చదువుకుంటూ ఉన్నారు.. కానీ లాక్ డౌన్ సమయానికి భారత్ కు చేరుకోవడంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు.

గత నెలలో షారుఖ్ ఖాన్ మన్నత్ బాల్కనీలో షూటింగ్ చేస్తూ కనిపించాడు. క్యాజువల్ డ్రెస్ లో కనిపించిన షారుఖ్ ఖాన్ అభిమానులకు అభివాదం తెలిపాడు. షారుఖ్ ఖాన్ అభిమానులు ముంబైకి వెళ్లారంటే తప్పకుండా మన్నత్ ముందుకు చేరుకుంటూ ఉంటారు. కొన్ని స్పెషల్ అకేషన్స్ లో షారుఖ్ మన్నత్ బాల్కనీలో నిలబడి తన సిగ్నేచర్ స్టైల్ లో అభివాదం చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

లాక్ డౌన్ నిబంధనలు కొద్ది కొద్దిగా సడలిస్తూ ఉండడంతో షారుఖ్ ఖాన్ కూడా తన రెడ్ చిల్లీస్ ఆఫీసుకు వెళ్లాలని అనుకుంటూ ఉన్నాడు. ఇదే విషయమై తన భార్య గౌరీని రెడ్ చిల్లీస్ ఆఫీసులో ఉన్న తన గది సీలింగ్ ను మార్చమని కోరాడు. ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌరీ ఈ విషయమై స్పందించారో లేదో.. ఇంకా తెలీదు.

షారుఖ్ ఖాన్ ఇటీవలి కాలంలో నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. షారుఖ్ మునుపటి మ్యాజిక్ స్క్రీన్ మీద కనిపించడం లేదని అభిమానులు చెబుతూ ఉన్నారు. షారుఖ్ నటించిన 'జీరో' సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో తర్వాతి సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. తన సంస్థ తరుపున పలు చిత్రాలను నిర్మిస్తూ ఉన్నాడు.

Next Story