మోదీపై అఫ్రిది వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన భార‌త క్రికెట‌ర్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2020 11:44 AM IST
మోదీపై అఫ్రిది వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన భార‌త క్రికెట‌ర్లు

క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచం మొత్తం పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం క‌శ్మీర్ పై మాట్లాడుతోంది. ఆ దేశ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది మ‌రో సారి త‌న వ‌క్ర‌బుద్ధి ప్ర‌ద‌ర్శించాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంట‌న్న పేద‌ల ప్ర‌జ‌ల‌కు త‌న ట్ర‌స్ట్ ద్వారా స‌హాయం చేసేందుకు ఆదివారం పీఓకే(పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌)లో ప‌ర్య‌టించి భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు.

పాకిస్తాన్ సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించింది. అయినా కశ్మీరీ పౌరులకు పాక్‌ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉందని వివాదాదస్పద వ్యాఖ్యలు చేయ‌గా.. అక్క‌డే ఉన్న పాక్ సైనికులు చ‌ప్ప‌ట్లు కొట్టిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

ఈ వ్యాఖ్య‌ల‌పై భార‌త క్రికెటర్లు త‌మ‌దైన శైలిలో స్పందించారు. మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ట్విటర్ వేదిక‌గా ఘాటుగా రిప్లై ఇచ్చాడు. పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. అలాంటి దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా?'అని 1971 యుద్దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు.

భార‌త ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అఫ్రీదీ వ్యాఖ్య‌ల‌కు దీటైన జ‌వాబిచ్చాడు. క‌రోనా మ‌హ‌మ్మారితో ప్ర‌పంచం పోరాడుతుంటే మీరు మాత్రం క‌శ్మీర్‌పైనే ప‌డి ఏడుస్తున్నారు. క‌శ్మీర్ మాది. మాతోనే ఉంటుంది. ఎప్ప‌టికీ మాదే. కావాలంటే 22 కోట్ల మందిని తీసుకురా. మాలో ఒక్క‌రు.. ల‌క్ష‌ల మందితో స‌మానం. అని ధావ‌న్ ట్వీట్ చేశాడు.

ఇక హర్భ‌జ‌న్ సింగ్ సైతం ఆఫ్రిదిపై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశాడు. అఫ్రిది తన హద్దులు దాటి మాట్లాడాడని, అతని వ్యాఖ్యలు చాలా బాధించాయన్నాడు. ఇక నుంచి అతనితో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశాడు. క‌రోనా విప‌త్తు వేళ అఫ్రిదీ మ‌ద్ద‌తు కోరితే తాను, యువీ స్పందించామ‌ని, అయినా భార‌త్‌పై అత‌డు విషం చిమ్ముతున్నాడ‌ని మండిప‌డ్డాడు. అత‌డిని స్నేహితుడని పిలిచినందుకు బాధ‌ప‌డుతున్నాన‌ని భ‌జ్జీ తెలిపాడు.

ఇక అఫ్రిది వ్యాఖ్యలను యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, తదిత‌ర‌ ఆటగాళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అఫ్రిది వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో సైతం పెను దుమారాన్నే రేపుతున్నాయి.

Next Story