దారుణం: ఒకరిని చంపబోయి మరొకరిని చంపేశారు..!

By సుభాష్  Published on  24 Sep 2020 4:07 AM GMT
దారుణం: ఒకరిని చంపబోయి మరొకరిని చంపేశారు..!

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకరిని చంపాలని ప్లాన్‌ వేసి.. చీకట్లో గుర్తించక మరొకరిని దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షాహిన్‌నగర్‌ వాది ఏ ముస్తాఫాలో ఉండే షాహిన్‌ సయ్యద్‌ మోమిన్‌ అలీ (25) మంగళవారం రాత్రి తన స్నేహితుడు ఫరాన్‌ ఇంట్లో ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున ఆకలిగా ఉందని, తినడానికి ఏమైనా తేవాలంటూ ఫరాన్‌ తన బైక్‌ ఇచ్చి మోమిన్‌ అలీ, మరో మిత్రుడు ఖాలెద్‌ను పంపించాడు. అయితే బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా, నలుగురు యువకులు వాహనంపై వచ్చి చీకట్లో మోమిన్‌ ఆలీని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. బైక్‌పై ఉన్న మరో స్నేహితుడు ఖాలెద్‌ బైక్‌ దిగి పరారయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని అతన్ని చికిత్సనిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా, మోమిన్‌ అలీ మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటన స్థలానికి ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ ప్రీత్‌సింగ్‌, అడిషనల్‌ డీసీపీ సురేందర్‌లు చేరుకుని పరిశీలించారు.

ఒకరిని చంపబోయి మరొకరిని..

కాగా, హత్యకు గురైన యువకుడు అమాయకుడని పోలీసులు తెలుసుకున్నారు. మోమిన్‌ అలీని పంపించిన ఫరాన్‌ పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో ఉంటున్నాడు. అలీని కాకుండా ఫరాన్‌ను హతమార్చాలని సదరు నిందితులు ప్లాన్‌ వేశారు. వారు వచ్చిన వాహనం ఫరాన్‌ది కావడంతో ఫరాన్ అనుకుని చీకటిలో బైక్‌పై మనిషిని గుర్తించక అమాయకుడైన అలీని హతమార్చారని పోలీసులు తెలిపారు. కాగా, సబ్బుల ఫ్యాక్టరీ ఉందని ఫరాన్‌ కొందరిని నమ్మించి దాదాపు రూ.18 లక్షల వరకు వసూలు చేసినట్లు పహాడీషరీఫ్‌ ఠాణాలో కేసు కూడా నమోదై ఉంది. ఏదీ ఏమైనా చంపాలనుకున్న వ్యక్తిని కాకుండా అమాయకుడైన అలీ బలయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పో్లీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story
Share it