డాక్టర్లను దేవుళ్లతో పోలుస్తుంటారు. నిజమే.. ప్రాణం పోయాలన్నా.. ప్రాణం తీయాలన్నా వైద్యుడికి చిటికెలో పని. రోగి ప్రాణాల్ని కాపాడేందుకు అహరంహం శ్రమించే వైద్యులు మన చుట్టూ కోకొల్లలుగా ఉంటారు. కొద్దిమంది నిర్లక్ష్యం వైద్యులపై విమర్శలు.. ఆరోపణలకు కారణమవుతుంటుంది. అదే సమయంలో కొందరు వైద్యులు చేసే రిస్క్ పెద్దగా హైలెట్ కావు. ఆ మాటకు వస్తే వారు పడే శ్రమ బయటకే రాదు. తాజా ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.

సుల్తానాబాద్  ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేసే డాక్టర్ శ్రీరామ్ చేసిన పని తెలిస్తే.. రెండు చేతులు జోడించి వండి దండం పెట్టాల్సిందే. మూర్తీభవించిన మానవత్వంతో ఆయన వ్యవహరించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరి ప్రశంసల్ని పొందుతోంది. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఒకరు ఆదివారం మరణించారు.

అంతిమ సంస్కారాల కోసం ఎవరూ ముందుకు రాలేదు. డెడ్ బాడీని ఆసుపత్రి నుంచి తరలించేందుకు మున్సిపల్ సిబ్బంది భయపడిపోయారు. తాము ఆ పని చేయలేమని చేతులెత్తేశారు. ఒక ట్రాక్టర్ ను తీసుకొచ్చి ఆసుపత్రి ముందు వదిలి వెళ్లిపోయారు. ఆసుపత్రి నుంచి శ్మశానానికి మృతదేహాన్ని తరలించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇదే సమయంలో సుల్తానాబాద్ కు చెందిన డాక్టర్ శ్రీరామ్ అక్కడే ఉన్నారు.
పరిస్థితిని గుర్తించిన ఆయన మానవత్వంతో స్పందించారు. ఆయన తీసుకున్న చొరవతో పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది మృతదేహాన్ని ట్రాక్టర్ లోకి తరలించారు. అనంతరం ఆయన పీపీఈకిట్ వేసుకొని ట్రాక్టర్ స్టీరింగ్ పట్టారు. తానే స్వయంగా శ్మశానానికి తరలించారు. ఈ ఉదంతం విన్నంతనే డాక్టర్ శ్రీరామ్ కు వంగి దండం పెట్టాలనిపించక మానదు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.