హర్యానాలో ఏడుగురు మంత్రులు ఓటమి..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 4:06 PM GMT
హర్యానాలో ఏడుగురు మంత్రులు ఓటమి..!!

హర్యానా: బీజేపీకి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం ఓడిపోయింది. టార్గెట్ 75 అంటూ ప్రచారం చేస్తే అందులో సగం స్థానాలే వచ్చాయి. ఏకంగా ఏడుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. అధికారాన్ని కోల్పోవడంతో ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు.

సర్వేలు ఫెయిలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు లెక్క తప్పాయి. హర్యానా కురుక్షేత్ర పోరాటంలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కమలదళం, కాంగ్రెస్, జేజేపీ మధ్య జరిగిన త్రిముఖ పోరులో ప్రజలు కూడా మిక్స్‌డ్‌గా తీర్పు ఇచ్చారు. ఓటర్లు ఏ పార్టీకి కూడా పూర్తి మద్ధతు కట్టబెట్టలేదు. ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.

హర్యానా శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఫలితాల సరళిలో తొలుత బీజేపీ పైచేయి సాధించింది. ట్రెండ్ చూస్తే కమలదళం అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపించింది. కానీ, కాసేపటికే ట్రెండ్ మారిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకొచ్చింది. జేజేపీ కూడా ప్రభావం చూపించింది. ఐఎన్‌ఎల్డీ, స్వతంత్రులు, ఇతరులు కూడా మోస్తరుగా రాణించడంతో బీజేపీ బలం తగ్గుతూ వచ్చింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళానికి చేదు ఫలితాలు వచ్చాయి. ఏకంగా ఏడుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్ట ర్, మంత్రి అనిల్ విజ్‌లు మాత్రమే గెలుపొందారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం చూడాల్సి వచ్చింది. ఇక, గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 8 సీట్లు కోల్పోయింది. 2014లో బీజేపీకి 47 సీట్లు వచ్చాయి. అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 17 సీట్లు పెరిగాయి. 2014లో హస్తం పార్టీకి 15 సీట్లు రాగా తాజా ఎన్నికల్లో 32 స్థానాలు లభించాయి.

ఆర్టికల్-370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ సహా జాతీయ అంశాలేవీ హర్యానా ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అన్నదాతల సమస్యలు, పారిశ్రామికరంగ ఇబ్బందులు, ఉద్యోగి-ఉపాధి అవకాశాలు దెబ్బతినడమే ప్రభావం చూపించాయి. ప్రధాని మోదీ హర్యానాలో ఏడు ర్యాలీలు నిర్వహించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. పార్టీ అగ్రనాయకత్వం అంతగా ఇంట్రెస్టు చూపకపోయినా రాష్ట్ర నాయకత్వమే సవాల్‌గా తీసుకొని ప్రజల్లోకి వెళ్లింది. కుమారి షెల్జా, భూపీందర్ సింగ్ హుడా నాయకత్వంలో పార్టీ శ్రేణులు కమలదళానికి దీటుగా పోరాడి మంచి ఫలితాలు సాధించారు.

Next Story