హాజీపూర్‌ వరుస హత్యాచారాల కేసు.. నేడే తుది తీర్పు

By అంజి  Published on  27 Jan 2020 3:55 AM GMT
హాజీపూర్‌ వరుస హత్యాచారాల కేసు.. నేడే తుది తీర్పు

నల్గొండ: హాజీపూర్‌ సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో ఇవాళ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. మైనర్ బాలికలు శ్రావణి, కల్పన, మనీషాలను నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి అత్యాచారం, హత్య చేసి మృతదేహాలను పాడుబడ్డ బావిలో పూడ్చిపెట్టాడు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిపై భువనగిరి పోలీసులు మూడు చార్జ్‌ షీట్లు దాఖలు చేశారు. ఇప్పటికే నల్గొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఈ కేసులో 300 మంది సాక్షులను విచారించింది. పలు కీలక ఆధారాలను కూడా సేకరించింది. ఈ కేసుకు సంబంధించి మూడు నెలల పాటు కొనసాగిన వాదనలు ఈ నెల 17న పూర్తి అయ్యాయి.

నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి చేసిన నేరాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. సీరియల్‌ హత్యల కేసులో ఫోరెన్సిక్‌ రిపోర్టు కీలకంగా మారనుంది. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి వీల్లేదని, శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్షకు అన్ని విధాల అర్హుడని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వాదనలు వినిపించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్ష విధించాలని బాధితులు, గ్రామస్తులు అంటున్నారు. కాగా వరుస హత్యల కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డి కోర్టు ఎలాంటి శిక్ష వేయబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతులను మాటల్లోపెట్టి, లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బైక్ పై ఎక్కించుకుని వాళ్లను కిడ్నాప్ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి తర్వాత సాక్ష్యాలను రూపుమాపడంకోసం వారిని హత్య చేసినట్టుగా నిందితుడు శ్రీనివాసరెడ్డి పోలీసుల విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. హత్య చేసిన తర్వాత నిందితుడు బాధితుల మృత దేహాలను పాడుబడిన బావిలో పడేసిన విషయాన్నికూడా విచారణలో ఒప్పుకున్నాడు. 2019 ఏప్రిల్ 28వ తేదీన రాచకొండ పోలీసులు ఆధారాలతో సహా నిందితుడు శ్రీనివాస రెడ్డిని అరెస్ట్ చేశారు. ఓ స్కూల్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్టుగా జరిగిన పాత అత్యాచారం హత్య కేసులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి.

ఉన్నట్టుండి మాయమై కనిపించకుండా పోయిన యువతులకోసం వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరసగా నాలుగు మిస్సింగ్ కేసులూ ఒకేలా ఉండడం పోలీసులకు అనుమానం కలిగించింది. శ్రీనివాసరెడ్డిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే నాలుగు అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిశాయి.

Next Story