ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సీరియల్ రేపిస్ట్ శ్రీనివాసరెడ్డి డిఎన్ఎ పరీక్షల నివేదిక

By Newsmeter.Network  Published on  7 Dec 2019 1:04 PM IST
ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సీరియల్ రేపిస్ట్ శ్రీనివాసరెడ్డి డిఎన్ఎ పరీక్షల నివేదిక

  • వేలిముద్రలను సేకరించి డి.ఎన్.ఎ పరీక్ష జరిపిన సి.ఎఫ్.ఎల్ అధికారులు
  • డి.ఎన్.ఎ పరీక్షలో నిందితుడు నేరానికి పాల్పడినట్టు ధృవీకరణ
  • ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పూర్తి స్థాయి నివేదిక సమర్పించిన సి.ఎఫ్.ఎల్ అధికారులు
  • వరంగల్ జైల్లో ఉన్న నిందితులు శ్రీనివాసరెడ్డి
  • నాలుగు అత్యాచారం హత్య కేసుల్లో శ్రీనివాసరెడ్డిపై చార్జ్ షీట్లు
  • మిస్సింగ్ కేసుల విచారణలో బయటపడ్డ విస్మయంగొలిపే నిజాలు
  • పోలీస్ విచారణలో నేరాలను అంగీకరించిన శ్రీనివాసరెడ్డి

హాజీపూర్ లో జరిగిన అత్యాచారం, హత్య కేసుల్లో నిందితుడు ఎమ్. శ్రీనివాసరెడ్డికి చెందిన వేలి ముద్రలను, డిఎన్ఎను పరీక్షంచగా నిందితుడు నేరానికి పాల్పడినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోందని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ అధికారులు నల్గొండ ఎడిజి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు విన్నవించారు.

హాజీపూర్ అత్యాచారం, హత్య కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మూడు చార్జ్ షీట్లు సమర్పించిన నల్గొండ జిల్లా పోలీసులు శ్రీనివాసరెడ్డి పాత్రపై వేగంగా విచారణ జరుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అత్యంత కీలకంగా మారింది. త్వరలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని భువనగిరి ఎసిపి భుజంగరావు తెలిపారు.

జూలై 31, 2019న రాచకొండ పోలీసులు హాజీపూర్ ముగ్గురు మైనర్ల పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి విడివిడిగా మూడు చార్జ్ షీట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సమర్పించారు. నిందితుడు శ్రీనివాస్ పథకం ప్రకారం నలుగురు యువతులపై అత్యాచారం జరిపి వారిని హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాధితురాళ్లలో ముగ్గురు మైనర్ బాలికలు.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతులను మాటల్లోపెట్టి, లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బైక్ పై ఎక్కించుకుని వాళ్లను కిడ్నాప్ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి తర్వాత సాక్ష్యాలను రూపుమాపడంకోసం వారిని హత్య చేసినట్టుగా నిందితుడు శ్రీనివాసరెడ్డి పోలీసుల విచారణలో తాను చేసిన నేరాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. హత్య చేసిన తర్వాత నిందితుడు బాధితుల మృత దేహాలను పాడుబడిన బావిలో పడేసిన విషయాన్నికూడా విచారణలో ఒప్పుకున్నాడు.

2019 ఏప్రియల్ 28వ తేదీన రాచకొండ పోలీసులు ఆధారాలతో సహా నిందితుడు శ్రీనివాస రెడ్డిని అరెస్ట్ చేశారు. ఓ స్కూల్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్టుగా జరిగిన పాత అత్యాచారం హత్య కేసులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి.

ఉన్నట్టుండి మాయమై కనిపించకుండా పోయిన యువతులకోసం వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరసగా నాలుగు మిస్సింగ్ కేసులూ ఒకేలా ఉండడం పోలీసులకు అనుమానం కలిగించింది. శ్రీనివాసరెడ్డిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తే నాలుగు అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిశాయి.

శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నిందితుడిని వరంగల్ జైలుకు తరలించారు. తర్వాత ఈ కేసులు వీలైనంత త్వరగా న్యాయం జరిగేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ అయ్యాయి. నిందితుడి వేలి ముద్రలను సేకరించి డి.ఎన్.ఎ పరీక్ష జరిపిన సి.ఎఫ్.ఎల్ విభాగం అధికారులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు పూర్తి స్థాయి నివేదికను అందించారు.

Next Story