ఇసుక బేరం.. సోషల్ మీడియా ఆగమాగం
By సత్య ప్రియ Published on 31 Oct 2019 9:01 AM GMTసోషల్ మీడియాలో కొంతకాలంగా ప్రతీదీ వింత అయిపోయింది. ఏ ఒక్క ఫోటో విభిన్నంగా కనిపించినా.. ఏ చిన్నపాటి వీడియో చూసినా ఎవరి ఆలోచనలకు తగ్గట్లు, ఎవరి వైఖరికి తగ్గట్టు వాళ్లు అన్వయించుకుంటున్నారు. సొంత కామెంటరీని జోడించి వైరల్ చేస్తున్నారు. అది చివరి యూజర్‌కు చేరుకునే సరికి పూర్తి స్వరూపమే మారిపోతోంది.
సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక.. సమాచార వ్యాప్తి విస్తృతమయ్యాక.. వార్తలు శరవేగంగా అందరికీ చేరిపోతున్నాయి. అయితే.. అదేస్థాయిలో తప్పుడు వార్తలు కూడా వైరల్‌గా మారిపోతున్నాయి. ఏదో ఒక ఫోటోకు తప్పుడు రైటప్ ఇవ్వడమో, లేదంటే ఎక్కడో జరిగిన ఓ వీడియో.. ఇక్కడే, ఇప్పుడే జరిగిందన్నట్లు ప్రచారం చేయడమో నిత్యకృత్యమైపోయింది. ఈ వ్యవహారం క్రమంగా 'అదిగో పులి అంటే ఇదిగో తోక' అన్నట్లుగా తయారయ్యింది. గిట్టని వాళ్లపై విషం కక్కే ఆయుధాలుగా కూడా అవి రూపం మార్చుకుంటున్నాయి.
ఆ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఓ ఫోటో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అయిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టినట్లుగా ఉంది. ఫలితంగా ఎవరికి వారు దాన్ని నిజమని నమ్మారు కూడా. సామాన్యుడినుంచి మొదలుకొని, ప్రముఖులు, జర్నలిస్టులు కూడా ఆ ప్రచారమే వాస్తవమనుకున్నారు. ఒక వర్గం కావాలని ఆ సన్నివేశం క్రియేట్ చేసి ఫోటోతీసి తప్పుడు ప్రచారం చేస్తుందని కూడా మరికొందరు అనుకున్నారు. అయితే.. అందులో చిన్న లాజిక్‌ను మిస్సయ్యారు. అలాగే.. ఓ ప్రాంతంలోని సంస్కృతికి అది ప్రత్యక్ష నిదర్శనమని తెలుసుకోలేకపోయారు.
ఈ ఫోటో చూసి నిజమే అని నమ్మిన వాళ్లు.. చిన్నడబ్బాల చొప్పున ఇసుక కొని ఏం నిర్మాణం చేయొచ్చు అనే లాజిక్ మర్చిపోయారు. చిన్నపాటి ప్రహారీగోడ నిర్మించాలన్నా.. లారీలకొద్దీ, టన్నులకొద్దీ ఇసుక అవసరం అవుతుంది. ఇలా.. చిన్న చిన్న డబ్బాలు, డబ్బాలుగా ఇసుక కొంటే ఏ నిర్మాణానికి సరిపోతుంది ? అనే వాస్తవం వాళ్ల ఆలోచనల్లోకి రాలేకపోయింది.
ఇక.. దాన్ని క్రియేట్ చేశారని భావించిన వాళ్లు కూడా.. ఒక అంశంపై వివాదం లేవనెత్తాలంటే కృత్రిమంగా ఆ సన్నివేశాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంటుందా ? అనే ప్రశ్నను తమకు తామే వేసుకోలేకపోయారు. అయితే.. ఆ ఫోటో నూటికి వెయ్యి శాతం నిజమే. ఇసుకను డబ్బాల చొప్పున అమ్మడం వాస్తవమే. కానీ.. అది ఆంధ్రప్రదేశ్‌లో కాదు. తెలంగాణలో.
రెండు రోజుల క్రితం ఈ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. పూర్వ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇప్పటి పెద్దపల్లి జిల్లా పరిధిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంథనిలో ఇసుకను డబ్బాల చొప్పున అమ్ముతున్న దృశ్యమది. రెండు రోజులు తిరిగేసరికి ఆ ఇసుక అమ్మకం ఫోటోకు సవాలక్ష సొంత కామెంట్లు జోడయ్యాయి. రాష్ట్రం ఎల్లలు కూడా దాటిపోయాయి. రాజకీయ రైటప్‌లూ తోడయ్యాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారంటూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న వాక్యాలూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. చివరకు ఆ ఫోటో ఎక్కడిదో, ఎందుకు అలా అమ్మాల్సి వచ్చిందో అన్న అసలు సంగతి మరుగున పడిపోయింది.
తెలంగాణలో ఇప్పుడు దీపావళి సీజన్. దీపావళి పండుగ మొదలుకొని.. కార్తీకపౌర్ణమి దాకా కేదారేశ్వరస్వామి నోములు, వ్రతాలు జరుపుకోవడం ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినా, పట్టణ ప్రాంతాల్లో చూసినా దాదాపు 70శాతం మంది కేదారేశ్వరస్వామి నోము నోచుకుంటారు. ఆ వ్రతంలో భాగంగా.. పవిత్రమైన నోము పాత్రలను గొలుసు (పారేనీళ్లలో అడుగున ఉండే ఇసుక) పైన ఉంచుతారు.
యేడాది పాటు.. అత్యంత పవిత్రంగా ఉట్టిమీద ఉంచే నోము కుండలను కిందికి దింపి.. పారే నీళ్లలో నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇసుక (గొలుసు)పైనే ఉంచుతారు. కింద అస్సలు పెట్టరు. అది ఇక్కడి సంప్రదాయం. గోదావరి పరీవాహకం ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లోని జనం గోదావరి ప్రవాహంలోని గొలుసు (ఇసుక)ను నోము నోచుకునే రోజు ఉదయాన్నే నదీస్నానమాచరించి తీసుకొచ్చి నోము కుండల కింద పేర్చుతారు.
అయితే.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కాళేశ్వరం నుంచి మొదలుకొని ఎగువన గోదావరిఖని , శ్రీపాద సాగర్ ప్రాజెక్టు దాకా గోదావరి నిండుకుండలా ఉంది. గతంలో అయితే.. ఈ సమయంలో పాయలు పాయలుగా ప్రవాహం ఉండేది. ఇప్పుడు పూర్తిగా గోదావరి నిండిపోవడంతో.. ఈ సంస్కృతి, సంప్రదాయం గురించి తెలిసిన మంథని ఆవల మంచిర్యాల జిల్లా, మహారాష్ట్రకు చెందిన కొందరు.. అక్కడి నదులు, ఏరులలో ఇసుకను తీసుకొచ్చి.. నోము పాత్రలకోసం చిన్నడబ్బా ఇసుక రూ.10 చొప్పున అమ్మారు.
ఆ గొలుసు ప్రాధాన్యం తెలిసిన, నోములు నోచుకునే వాళ్లు.. కొనుక్కెళ్లారు. బహుశా కార్తీక పౌర్ణమి వరకే ఈ దృశ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ పవిత్రమైన గొలుసు (ఇసుక) అవసరం ఎవరికీ ఉండదు. కానీ.. ఈ ఒక్క ఫోటోతో అనేక రైటప్‌లు అల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సంస్కృతి గురించి తెలియని వాళ్లు ఆ ఫోటోతో పాటు సర్క్యులేట్ అవుతున్న రైటప్‌లనే గుడ్డిగా నమ్మాల్సి వస్తోంది. అందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కల్పితాలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నిరంతరం ప్రయత్నం సాగాల్సి ఉంది.