సంవత్సరాంతంలో కరోనా మళ్లీ విజృంభిస్తుందా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 2:53 PM GMT
సంవత్సరాంతంలో కరోనా మళ్లీ విజృంభిస్తుందా.?

యావత్ ప్రపంచం షట్ డౌన్ అయ్యేలాచేసింది కరోనా వైరస్. ఐరోపా దేశాలైతే కరోనా దెబ్బకు హడలెత్తిపోయాయి. చైనా లోని వుహాన్ నుంచి విస్తరించిన ఈ వైరస్ నిదానంగా ఆ దేశ సరిహద్దులు దాటి ఐరోపా దేశాల్లో విస్తరించడం మొదలైంది. చైనా మినహా మిగతా దేశాల్లో వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఆయా దేశాల్లో స్థిరపడిన భారతీయులు స్వదేశానికి క్యూ కట్టారు. వీరి ద్వారానే దేశంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇండోనేషియన్ల ద్వారా వైరస్ కరీంనగర్ లో సామాజిక వ్యాప్తికి దారి తీసింది. వచ్చే వేసవిలో వైరస్ చచ్చిపోతుందని ప్రపంచ ఆరోగ్య శాఖతో పాటు అంతా అనుకున్నారు. కానీ అందరి ఊహాగానాలపై కరోనా ఊహించని దెబ్బకొట్టింది.

ఉష్ణోగ్రతకు అనుకూలంగా వైరస్ రూపాంతరం చెందుతుండటంతో మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసులు, మృతుల సంఖ్య అంతకంతకూ ఎగబాకుతోంది. లాక్ డౌన్ 4.O లో కేంద్రం కొన్ని సడలింపులివ్వడంతో కేసులు మరింత పెరుగుతున్నాయి. ఇటీవలే తెలంగాణలో ఒక్కరోజే నలుగురు కరోనా పేషెంట్లు చనిపోగా, ఆంధ్రప్రదేశ్ లో 3 మృతి చెందారు. దేశ వ్యాప్తంగా అయితే లాక్ డౌన్ సడలింపులు ఇవ్వక మునుపు వరకూ 24 గంటల్లో 1000-1500 కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఏకంగా రోజుకి 6-8 వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. దీనిని బట్టి దేశంలో వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అంచనా వేయొచ్చు.

ఇటీవలే జపాన్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఏదో జనరిక్ మెడిసిన్ కనుగొన్నట్లు తెలిపారు. ఈ మెడిసిన్ ద్వారా అయినా వైరస్ తగ్గుముఖం పడుతుందేమోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు కానీ ఆ మెడిసిన్ అందుబాటులోకి వచ్చేసరికి ఇంకెన్ని కేసులు పెరుగుతాయోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల విషయానికొస్తే లక్షా 50 వేలకు చేరువలో ఉన్నాయి.

రెండోదశ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోంది ?

ఒకవేళ కరోనా ఇప్పుడు తగ్గినా సంవత్సరాంతంలో మళ్లీ విజృంభించే ప్రమాదముందని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. రెండోసారి వైరస్ విజృంభణ మొదలైతే మాత్రం దానిని ఎవ్వరూ కట్టడి చేయలేరని, అలాంటి పరిస్థితి రాకూడదంటే ఐరోపా దేశాలతో పాటు వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాలు సైతం తరచూ కరోనా నిర్థారణ పరీక్షలు చేయాల్సి ఉంటుందని సూచించింది.

వివిధ దేశాల్లో లాక్ డౌన్ ను దశల వారిగా సడలిస్తుండటంతో ..ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ మైక్ ర్యాన్ వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని ఆందోళన చెందారు. ఇప్పుడు వైరస్ తగ్గినా..రెండవ దశలో తీవ్రప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ సంవత్సరాంతంలోపు వైరస్ రెండవసారి దాడి చేయొచ్చని..అది ఖచ్చితంగా ఇన్ని నెలల తర్వాత వ్యాప్తి చెందడం మొదలవుతుందని మాత్రం చెప్పలేమన్నారు. రెండవ దశలో వైరస్ వ్యాప్తి తారా స్థాయిలో ఉండొచ్చని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Next Story