ఆ వ్యక్తి ఆస్పత్రి బిల్లు చూస్తే షాకే.. ఏకంగా 8కోట్లు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2020 5:18 AM GMT
ఆ వ్యక్తి ఆస్పత్రి బిల్లు చూస్తే షాకే.. ఏకంగా 8కోట్లు..

కరోనా మహమ్మరి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 4లక్షలకు పైగా మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఓ 70ఏళ్ల వృద్దుడు కరోనా మహమ్మారిని జయించాడు. అయితే.. ఆ ఆనందం అతడికి ఏమాత్రం లేకుండా చేశారు. ఆస్పత్రి వారు ఇచ్చిన బిల్లు చూసి ఆయన గుండె ఝళ్లుమంది. ఆ బిల్లు వేలు, లక్షల్లో లేదు. కోట్లలో ఉంది. ఈ ఘటన వాషింగ్టన్ లో జరిగింది

'ది సియాటెల్ టైమ్స్' వెల్లడించిన కథనం ప్రకారం.. సియాటెల్‌ నగరానికి చెందిన మైఖేల్‌ ఫ్లోర్‌ అనే 70 ఏళ్ల వ్యక్తి మార్చి 4న అనారోగ్యంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకిందని తేలింది. వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే.. కొన్ని రోజులకి అతడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆ సమయంలో ఆస్పత్రి వారు ఆఖరిసారి భార్యా పిల్లలతో మాట్లాడుకోమని చెప్పారు. కుటుంబ సభ్యులను కలిసే వీలు లేకపోవడంతో అతడు ఫోన్‌లోనే అందరికి గుడ్‌బై చెప్పాడు. అంతా అతడికి చివరి క్షణాలు అనుకున్నారు. అయితే.. అతడి శరీరం చికిత్సకు స్పందించింది. అతను మెల్లిగా కోలుకుని మే 5న డిశ్చార్జ్ అయ్యాడు.

62 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అతడిని చూసి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. ఇక కిందకు వచ్చి చూస్తే ఆ కుటుంబం ఆనందం ఎంతో సేపు నిలవలేదు. హాస్పిటల్ యాజమాన్యం 181 పేజీల బిల్లును ఇచ్చింది. అన్ని రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేసినందుకు మొత్తం 1,122,501.04 డాలర్ల బిల్లు వేసింది. మన కరెన్సీలో రూ.8.5కోట్లు.

అయితే అది అతను కట్టాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే.. అమెరికాలో వృద్ధుల ఆరోగ్య బీమా పథకం మైఖేల్ కు వర్తిస్తుందని, ఈ మొత్తాన్ని అతను తన జేబులో నుంచి కట్టాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఆస్పత్రికి చెల్లించనుంది.

Next Story