విక్రముడి కోసం మళ్లీ అన్వేషణ...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 3:35 PM GMT
విక్రముడి కోసం మళ్లీ అన్వేషణ...!

విక్రముడి అన్వేషణ మళ్లీ ప్రారంభమైంది. వెలుగురేఖలు రావడంతో ల్యాండర్ కోసం ప్రయత్నాలు పున: ప్రారంభమయ్యాయి. ఇస్రోకు మద్ధతుగా నాసా రంగం లోకి దిగింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ కోసం అన్వేషిస్తోంది. నాసాకు చెందిన లూనార్ రికైన్‌సెన్స్ ఆర్బిటార్‌, విక్రమ్ ల్యాండర్ పడిపోయిన ప్రాంతానికి సంబంధించిన ఫోటోలు తీసింది. ఆ ఫోటోలు తీసుకున్న నాసా, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. LRO చిత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత విక్రమ్ పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి.

గత వారం వరకు చంద్రుని దక్షిణ ధ్రువంపై లూనార్ నైట్ కొనసాగింది. దాంతో విక్రమ్ అన్వేషణ ఆగిపోయింది. రాత్రి వేళల్లో విక్రమ్ జాడను గుర్తించడం నాసా, ఇస్రోలకు సాధ్యం కాలేదు. సెప్టెంబర్ 17న దక్షిణ ధ్రువం మీద నుంచి లూనార్ వెళ్లినప్పటికీ అక్కడ చీకటి ఛాయలు ఉండడంతో విక్రమ్ ఆచూకీని పసిగట్టలేకపో యారు. ఇప్పుడు రాత్రి సమయం ముగిసి మళ్లీ పగలు మొదలైంది. ఇప్పుడిప్పుడే చంద్రుడి ద‌క్షిణ ద్రువం వెలుగులోకి వ‌స్తోంది. గత మూన్నాళ్లుగు రోజులుగా చంద్రుడి ఉపరితలంపై వెలుతురు పెరిగింది. దాంతో మరోసారి లూనార్‌ను పంపించారు.

సెప్టెంబర్ 7వ తేదీన చంద్రయాన్-2 ప్రయోగంలో అత్యంత కీలకమైన విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేసే ప్రక్రియ చేపట్టారు. ఐతే, చివరి నిమిషంలో ల్యాండర్‌తో భూకేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. విక్రమ్‌ను కాంటాక్టు చేయడానికి ఇస్రో, నాసాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.

Next Story