బీజేపీలోకి సింధియా? కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?
By Newsmeter.Network Published on 10 March 2020 11:32 AM IST
మధ్య ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మలుపు తిరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సింధియా బీజేపీలో చేరేందుకు సిద్ధం కావటమే. ఈ మేరకు ఆయన మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. వీరిభేటీ మధ్య ప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింధియా వెంట 17మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కాంగ్రెస్‌ను వీడే అవకాశాలుకనిపిస్తున్నాయి. సింధియాతో ఇంతకు ముందే బీజేపీ నేతలు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీలోకి వస్తే రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటికి బలాన్ని చేకూర్చుతూ సింధియా మంగళవారం అమిత్‌షా, ప్రధాని మోదీతో భేటీ కావటం మధ్య ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇదిలాఉంటే ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్యం సింధియా, ఆయనకు మద్దతుదారులుగా భావిస్తున్న 17మంది ఎమ్మెల్యేలు సోమవారమే రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. వీరిలో ఆరుగురు మంత్రులూ ఉన్నారు. వీరంతా ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లి మకాం వేశారు. ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు సీఎం కమల్‌నాథ్ తన మంత్రివర్గంతో సమావేశమై.. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వీలుగా క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించి, ఇందుకోసం 20మంది మంత్రులతో రాజీనామా చేయించారు. అయినా సింధియా వెనక్కుతగ్గే పరిస్థితి కనిపించటం లేదు.
సింధియా షాకిస్తే.. సర్కార్ కుప్పకూలినట్లే..
సింధియా బీజేపీలో చేరి కాంగ్రెస్‌కు షాకిస్తే.. మధ్య ప్రదేశ్‌లో ఆ పార్టీ సర్కార్ కుప్పకూలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కమల్‌నాథ్‌నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిపాటి మెజార్టీతో నెట్టుకొస్తుంది. మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 మంది సభ్యులున్నారు. మ్యాజిక్ ఫిగర్ 116 ఉండాలి. వీరిలో కాంగ్రెస్‌కు 114, విపక్ష భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్రులు నలుగురు, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 17మంది సింధియా వెంట బీజేపీలోకి వెళితే అక్కడి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తుంది.
దీనికితోడు ఆ రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాస్తవ బలాబలాల ప్రకారం కాంగ్రెస్ భాజపాలకు చెరో సీటు దక్కనుంది. మూడో సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు వీరు కాంగ్రెస్ రెబల్స్ బీజేపీలో చేరితే రాజ్యసభ స్థానాన్ని బీజేపీ దక్కించుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. సింధియా ఇచ్చే షాక్ నుంచి ఎలా బయటపడాలా, ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలా అని తలమునకలయ్యారు. ప్రస్తుత ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాల్సిందే.