పురాతన అడవి ఆనవాళ్లు..!
By అంజి
మన భూమి మీద అడవులు కొత్తవేమీ కావు. మనుషులకన్నా ముందు అడవులే ఆక్రమించి ఉండేవి అనడంలో అతిశయోక్తి కూడా ఏమి లేదు. అయితే భూమిపై అత్యంత పురాతన శిలాజ అడవి ఎక్కడుంది? ఈ ప్రశ్నకు ఇప్పటివరకూ చెప్పిన సమాధానం.. ‘అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న గిల్బావో’. ఇప్పుడు ఆ స్థలం మారింది. ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతన శిలాజ అడవి గిల్బావోలో కాకుండా అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలోని కైరోలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సుమారు 38.6 కోట్ల సంవత్సరాల క్రితం దని భావిస్తున్నారు. అంటే గిల్బావోలో గుర్తించినదానితో పోలిస్తే కైరోలోని అడవి దాదాపు 20-30 లక్షల ఏళ్లు పురాతనమైనది.
న్యూయార్క్ స్టేట్ మ్యూజియం, బింగ్‌హామ్‌టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు బ్రిటన్‌లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో కైరోలో 3 వేల చదరపు మీటర్ల మేర విస్తరించిన శిలాజ అడవిని గుర్తించారు. మొత్తం 11 మంది శాస్త్రవేత్తలు పదేళ్ళపాటు పరిశోధనలు నిర్వహించారు. హడ్సన్ లోయలో క్యాట్‌స్కిల్ పర్వతపాద ప్రాంతంలోని ఇసుకరాతి గనిలో దాని జాడ కనిపించింది. న్యూయార్క్ నుంచి పెన్సిల్వేనియా వరకు ఆ అడవి విస్తరించి ఉండొచ్చని అంచనా వేశారు. అందులో ప్రధానంగా క్లాడోగ్జైలాప్సిడ్స్, ఆర్కియాప్టెరిస్ అనే రెండు రకాల చెట్లు ఉండేవని పేర్కొన్నారు. వాటి పరిమాణం మరీ చిన్నగా కాకుండా, భారీగా కాకుండా మధ్యస్థంగా ఉండేదని చెప్పారు. విత్తనాల ద్వారా కాకుండా ఉత్పాదక కోశములు అంటే స్పోర్స్ తోనే అవి ప్రత్యుత్పత్తి జరుపుకునేవని తెలిపారు. ఆ చెట్ల వేర్ల పొడవు 11 మీటర్ల కంటే ఎక్కువే ఉండేదని వెల్లడించారు.