Chandrayaan 3: 14 రోజుల పాటు పరిశోధనలు.. ఆ తర్వాత..
చంద్రుడిపై దిగిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌తో ఇస్రో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
By అంజి Published on 24 Aug 2023 2:01 AM GMTChandrayaan 3: 14 రోజుల పాటు పరిశోధనలు.. ఆ తర్వాత..
చంద్రుడిపై దిగిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌తో ఇస్రో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ పని చేసేది ఒక్క పగలు మాత్రమే. ఎందుకంటే చంద్రుడిపై ఒకపూట.. భూమిపై 14 రోజులకు సమానం. చంద్రుడిపై ఇప్పటికే సూర్యోదయం మొదలైంది. 14 రోజుల పాటు వెలుగు ఉంటుంది. అప్పటి వరకు విక్రమ్, ప్రగ్యాన్‌లలోని వ్యవస్థలు సమర్థవంతంగా పని చేస్తాయి. చంద్రుడిపై పగటిపూట ఎండ విపరీతంగా ఉంటుంది. సుమారు 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక రాత్రి సమయంలో అందుకు పూర్తి విరుద్ధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి పరిస్థితిలో ల్యాండర్, రోవర్ పని చేయడం దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఒకవేళ చలిని తట్టుకుని 14 రోజుల తర్వాత మళ్లీ ఎండరాగానే అవి పని చేస్తే.. మనకు బోనస్‌గా మరో 14 రోజులు కలిసి వచ్చే అవకాశం ఉంది. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ పూర్తి చేసుకున్న కాసేపటికే బెంగళూరులోని ఇస్ట్రాక్ - మాక్స్‌తో కమ్యూనికేషన్ ఏర్పరుచుకుంది. విక్రమ్ ల్యాండ్ అయ్యాక దాదాపు 4 గంటలకు దాని ర్యాంప్ విచ్చుకుంది. ల్యాండర్‌లోని ఆరు చక్రాల రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చింది. ప్రగ్యాన్ వెనుక చక్రాలపై ఉన్న భారత జాతీయ చిహ్నం, ఇస్రో ముద్రలను అద్దింది. ఈ ముద్రలు ఎన్నేళ్లయినా అలాగే ఉంటాయి. ఎందుకంటే చంద్రుడిపై గాలి లేదు కాబట్టి. చంద్రుడిపై అది సెకనుకు సెంటీమీటరు వేగంతో నడక సాగిస్తూ పరిశోధనలు చేపట్టింది.
మూన్ మిషన్ విజయవంతమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాలు దేశమంతా కలిసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రయాన్-3 చంద్రుడిపై సాఫీగా దిగడంతో పాఠశాల విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ చారిత్రక ఘట్టాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులు కలిసి చరిత్రను చూసేందుకు వీలుగా పాఠశాల సమయాలను 1-2 గంటలు పొడిగించారు. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అయిందని ప్రకటించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. లైవ్ టెలికాస్ట్ ప్రారంభం కాకముందే పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది. మిషన్ విజయవంతం కావాలని విద్యార్థులు ప్రార్థనలు చేశారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు నేలపై కూర్చొని ఇస్రో, చంద్రయాన్-3 వంటి పదాలను రూపొందించేందుకు అందమైన నిర్మాణాలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యక్షంగా వీక్షించారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసినట్లు ఇస్రో ప్రకటించినప్పుడు, భారత అంతరిక్ష శాస్త్రవేత్తల చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసించేందుకు గవర్నర్ తన కుర్చీపై నుంచి లేచి నిల్చున్నారు. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అపురూపమైన విజయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసి, ఈ ఘనత సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా అవతరించినందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ఇస్రోను అభినందించారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇస్రోను అభినందించారు. ‘‘భారతీయులుగా ఇది మాకు గర్వకారణం. భారతదేశ వైజ్ఞానిక విజయాల సుదీర్ఘ వారసత్వానికి మరో గొప్ప జోడింపు” అని ఆయన ఎక్స్‌లో రాశారు.