సౌర తుఫాన్ భూమిని తాక‌నుందా..? జీపీఎస్‌, మొబైల్ సేవ‌ల‌కు అంత‌రాయం..?

Solar storm to strike Earth Expect mobile GPS satellite disruptions.శ‌క్తివంత‌మైన సౌర తుఫాన్ భూమి వైపు వేగంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2022 10:02 AM IST
సౌర తుఫాన్ భూమిని తాక‌నుందా..?  జీపీఎస్‌, మొబైల్ సేవ‌ల‌కు అంత‌రాయం..?

శ‌క్తివంత‌మైన సౌర తుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకువ‌స్తున్న‌ట్లు అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా తెలిపింది. నేడు(జూలై 20న‌) ఈ తుఫాను భూమిని తాకే అవ‌కాశం ఉంది. ఇటువంటి సౌర తుపాన్లు భూమిని తాక‌డం చాలా సాధార‌ణ‌మే అయినా ఈ సారి దీని ప్ర‌భావం అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుఫాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వేగం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఎప్పుడైనా భూమిని తాక‌వ‌చ్చున‌ని చెప్పారు. సౌర తుఫాను కార‌ణంగా జీపీఎస్‌తో పాటు రేడియో, మొబైల్ సిగ్న‌ళ్ల‌కు అంత‌రాయం క‌లిగే ప్ర‌మాదం ఉండ‌వ‌చ్చున‌ని చెబుతున్నారు.

జూలై 15న సూర్యుడి ఉప‌రితంలో ఓ శ‌క్తివంత‌మైన ఓ సౌర జ్వాల మొద‌లైన‌ట్లు అంత‌రిక్ష శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. గంట‌కు ల‌క్ష‌ల కి.మీ వేగంతో ప్ర‌యాణిస్తున్న ఈ సౌర తుఫాను జూలై 20, 21 తేదీల్లో భూ అయ‌స్కాంత క్షేత్రాన్ని తాక‌వ‌చ్చున‌ని అంచనా వేస్తున్నారు. దీని కార‌ణంగా ఉత్త‌ర‌, ద‌క్షిణ ధ్రువాల్లో ప్ర‌కాశ‌వంత‌మైన ఖ‌గోళ కాంతి క‌నిపించ‌డ‌మే కాకుండా భూమి బాహ్య వాతావ‌ర‌ణం కూడా వేడేక్కే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా. ఈ ప్రభావం ఉపగ్రహాలపై పడి.. GPS నేవిగేషన్‌, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయే ముప్పుందని హెచ్చరించారు. మానవ ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు.

Next Story