యాంకర్ లేకుండా న్యూస్.. మరి చదివేది ఎవరు?

టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంచలనం సృష్టిస్తోంది. ఏఐ రోజురోజుకు తన అడ్వాన్స్మెంట్ చూపిస్తుంది.

By అంజి  Published on  11 July 2023 10:29 AM IST
Odisha, otv channel, AI news anchor, anchor lisa

యాంకర్ లేకుండా న్యూస్.. మరి చదివేది ఎవరు? 

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మనుషులు తమ చేతితో చేయాల్సిన పనులను కూడా కంప్యూటర్లు, ఆధునాతన మిషన్ల సహాయంతో వేగంగా చేస్తున్నారు. దీనికితోడు టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంచలనం సృష్టిస్తోంది. ఏఐ రోజురోజుకు తన అడ్వాన్స్మెంట్ చూపిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అన్ని పనులు చేసేలా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే చాట్‌ జీపీటీ ద్వారా చదవడం, రాయడం వంటి అనేక పనులు సునాయాసంగా మారాయి. ఏఐ టెక్నాలజీ చాలా రంగాల్లో వినియోగంలోకి వచ్చింది. ఇప్పుడు కృత్రిమ మేధ సహాయంతో యాంకర్లను కూడా టెలివిజన్ స్క్రీన్ మీద తీసుకు వస్తున్నారు.

తాజాగా ఒడిశాలో ఓ న్యూస్ ఛానెల్.. ఏఐ న్యూస్‌ ప్రెజెంటర్‌ను పరిచయం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన మొదటి వర్చువల్ న్యూస్ ప్రజెంటర్‌ వార్తలు చదివి వినిపిచింది. ఒడిశాకు చెందిన ప్రైవేట్‌ న్యూస్‌ ఛానల్‌ OTV.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ లిసాను రూపొందించింది. అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న యాంకర్‌ లిసాను.. ఒడిశా సాంప్రదాయ చేనేత చీరను ధరించి, చక్కని ఆహార్యంతో కంప్యూటర్‌లో రూపొందించారు. టెలివిజన్‌లో, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ ఒరియాతో పాటు ఇంగ్లీషులోనూ వార్తలు చదివే విధంగా యాంకర్‌ లిసాను ప్రోగ్రామ్‌ చేశారు. టీవీలో చీరకట్టులో అచ్చం నిజమైన లేడీ యాంకర్‌లాగే ఏఐతో తయారు చేసిన వర్చువల్ న్యూస్‌ యాంకర్‌ లీసా.. వార్తలను గడగడా చదివింది.

అసలైన న్యూస్‌ యాంకర్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా వార్తలు చదివిన లిసా.. అందరినీ ఆశ్చర్యపర్చింది. ఏఐతో తయారు చేయబడిన యాంకర్‌ లిసాకు బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్య ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లీష్‌ వార్తలపైనే ఫోకస్‌ పెట్టింది. లీసా పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు కూడా ప్రారంభించింది ఆ ఛానెల్. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీలు లిసా పేరు మీద ఉన్నాయి. చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని ఛానెళ్లు కూడా ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్‌ కనిపిస్తున్నాయి. ఒడిశాలో ఏఐతో తయారుచేయబడిన లిసా యాంకర్ గా టెలివిజన్ స్క్రీన్ మీదకు రావడం మైలురాయిని సూచిస్తోంది. రాబోయే రోజులలో మరింత నైపుణ్యం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Next Story