అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది నిర్దారించుకోవడానికి నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ ఆ గ్రహంపై కాలుమోపింది. అంగారకుడిపై దిగిన రోవర్ వీడియో తాజాగా మంగళవారం నాసా విడుదల చేసింది. మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో 'పర్సెవరెన్స్' అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్ అయిన క్షణాలు ఈ వీడియోలో రికార్డు అయ్యాయి. రోవర్ ల్యాండవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్ కిందకు దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో హర్షించం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పర్సెవరెన్స్ రోవర్ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన విషయం తెలిసిందే.
ఈ రోవర్‌లో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లను ఇంజనీర్లు అమర్చారు. రోవర్ అంగారకుడిపై ల్యాండింగ్ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను ఇంజనీర్లు స్విచ్ ఆన్ చేశారు. రానున్న కొన్ని రోజుల్లో రోవర్ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని ఫోటోలు, వీడియో రికార్డింగ్‌లను చేస్తామని చెప్పిన మూడు రోజులకే నాసా తాజా ఈ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే పర్సెవరెన్స్ అరుణ గ్రహ ఉపరితలానికి సంబంధించి అద్భుతమైన ఫోటోలు పంపిన విషయం తెలిసిందే. తాజాగా రోవర్‌పై ల్యాండ్ అవుతున్నవీడియోను చూసి శాస్త్రవేత్తలు సైతం ఆనందంలో మునిగిపోయారు.