ఇంటర్నెట్ వాడుతున్న భారత్‌లోని సగానికిపైగా జనం.. ఇదే ఫస్ట్ టైం.!
ప్రస్తుతం కాలంలో ఇంటర్నెట్ లేకుండా ఏ పని జరగడం లేదు. భారత్‌లోనైతే ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నది.
By అంజి Published on 8 May 2023 1:16 PM ISTఇంటర్నెట్ వాడుతున్న భారత్‌లోని సగానికిపైగా జనం.. ఇదే ఫస్ట్ టైం.!
ప్రస్తుతం కాలంలో ఇంటర్నెట్ లేకుండా ఏ పని జరగడం లేదు. భారత్‌లోనైతే ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నది. 5జీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య పెరిగింది. 2022 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో సగానికిపైగా ప్రజలు నెలలో ఒకసారైనా ఇంటర్నెట్ వాడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. దేశ జనాభాలో సగానికిపైగా అంటే 75.9 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభా అధికంగా ఇంటర్నెట్ వాడటం ఇదే మొదటిసారి.
భారత్‌లో ఇంటర్నెట్ వాడకంపై 'ఇంటర్నెట్ ఇన్ ఇండియా-2022' అనే అంశంపై ఐఏఎంఏఐ, కాంటార్ కలిసి చేసిన సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. దేశంలో వచ్చే రెండేళ్లలో 90 కోట్ల వరకు ఇంటర్నెట్ యూజర్లకు చేరుకుంటుందని ఈ రీసెర్చ్‌లో తేలింది. ఇక ఇంటర్నెట్ యూజర్లలో అధికంగా 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఉండటం విశేషం. అలాగే 36 కోట్ల మంది పట్టణవాసులు ఇంటర్నెట్ వాడుతున్నారు. గ్రామాల్లో 14 శాతం, పట్టణాల్లో 6 శాతం ఇంటర్నెట్ వాడకం వృద్ధి చెందింది. వచ్చే రెండు ఏళ్లలో కొత్త ఇంటర్నెట్ యూజర్లలో 56 శాతం గ్రామీణులే ఉంటారని ఈ అధ్యయనం అంచనా వేసింది.
రాష్ట్రాల వారిగా చూస్తే గోవాలో అత్యధికంగా 70 శాతం ఇంటర్నెట్ వాడుతున్నారు. బీహార్‌లో మాత్రం 32 శాతం మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారు. భారత్‌లో ముఖ్యంగా ఇంటర్నెట్‌ను ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్‌మీడియా కోసం వాడుతున్నారు. ఇంటర్నెట్ యూజర్లలో 54 శాతం మంది పురుషులు ఉండగా, మహిళలు 57 శాతం ఉన్నారు. వచ్చే రెండేళ్లలో మహిళల ఇంటర్నెట్ వాడకం 65 శాతానికి చేరుకోనుంది. రానున్న కాలంలో ఇంటర్నెట్ వాడకంలో మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తొలగనున్నాయి. దేశంలో 2021తో పోలిస్తే 2022లో డిజిటల్ చెల్లింపులు 13 శాతం పెరగడం గమనార్హం. 33.8 కోట్ల మంది డిజిటల్ పేమెంట్స్‌పై మొగ్గుచూపుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారిలో గ్రామీణులు 36 శాతం మంది మాత్రమే ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్‌లో 99 శాతం మంది యూపీఐ వాడుతున్నారని ఐఏఎంఏఐ, కాంటార్ చేసిన సర్వే చేసిన రిపోర్ట్‌లో తేలింది.