ట్విట్టర్ యూజర్లకు 'కూ' యాప్ బంపర్ ఆఫర్.!
Koo App Wont Charge Any Verification Badge Fee Like Twitter Ceo. ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లలో ట్విటర్ ఒకటి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా..
By అంజి Published on 2 Nov 2022 4:56 AM GMTప్రముఖ సోషల్ మీడియా యాప్‌లలో ట్విటర్ ఒకటి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా.. చాలా మంది ఈ వేదికగానే తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. అయితే ఇటీవలే ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా.. ఆగమేఘాల మీద ట్విటర్‌లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. ఈ సమయంలోనే భారత్‌లో ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న దేశీ సోషల్ మీడియా యాప్ 'కూ' ట్విటర్ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫ్రీగా సేవలు అందిస్తామని 'కూ' యాప్ ప్రకటించింది.
ఇప్పటికే ట్విటర్‌లో బ్లూ టిక్ కలిగి ఉండాలంటే యూజర్లు నెలకు 8డాలర్లు(భారత కరెన్సీలో రూ.660) చెల్లించాల్సి ఉంటుందని మస్క్ మంగళవారం ట్వీట్ చేశాడు. కొనుగోలు శక్తి సమానత్వానికి, దేశానికి అనుగుణంగా ధర సర్దుబాటు చేశామని ఆయన చెప్పాడు. దీంతో వెరిఫైడ్ అకౌంట్ ఉన్నవాళ్లు నెలకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. బ్లూటిక్ ఉన్నవారికి మరిన్ని ఫీచర్లు అందించే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఎలన్‌మస్క్ ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదే సమయంలో భారత్‌లో ట్విటర్ ప్రత్యామ్నాయంగా కూ యాప్ ఉంది. తాజాగా తాము కూ యాప్ నుంచి ఉచితంగా సేవలు అందిస్తామని సంస్థ కో-ఫౌండర్ కం సీఈవో అప్రమేయ రాధాకృష్ణ ట్వీట్ చేశారు. ట్విట్టర్ యూజర్లు తక్షణం 'కూ' యాప్‌లోకి మారండి అనేలా సంకేతమిస్తూ .. #SwitchtoKoo' అనే హ్యాష్‌టాగ్ జత చేశారు. బ్లూటిక్ అకౌంట్‌ల సబ్‌స్క్రిప్షన్స్‌తో మస్క్ ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇదే సమయాన్ని తమ యాప్ యాప్ విస్తరణకు అనుకూలంగా మార్చుకోవాలని 'కూ' భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆత్మ నిర్భర్ భారత్ పిలుపు మేరకు 2020లో 'కూ' యాప్ ఏర్పాటైంది. ఇప్పటికే చాలా మంది 'కూ' యాప్‌ను వాడుతున్నారు.
Koo will not charge Rs. 1600 per month for a verification badge. #switchtokoo 🙂
— Aprameya 🇮🇳 (@aprameya) October 31, 2022