ఇస్రో 'బాహుబలి' రాకెట్.. 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి
Isro's heaviest rocket successfully places 36 OneWeb satellites into orbits.ఇస్రో ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది.
By - తోట వంశీ కుమార్ |
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్‌వీఎం-3 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ రాకెట్ 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తద్వారా ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకమైన రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి.
భారత కాలమానం ప్రకారం గత అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు స్పేస్ సెంటర్ రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెన్‌ను ప్రయోగించారు. ప్రైవేటు కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా వాటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో తెలిపింది.
LVM3 M2/OneWeb India-1 mission is completed successfully. All the 36 satellites have been placed into intended orbits. @NSIL_India @OneWeb
— ISRO (@isro) October 22, 2022
లాంచ్ వెహికల్ మార్క్-3 అనేది జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ (జీఎల్ఎల్‌వీ ఎంకే-3)కి అప్‌గ్రేడెడ్ వెర్షన్. జీఎస్ఎల్‌వీ ఎల్‌వీఎం 3 పేలోడ్ సామర్థ్యం 10 టన్నులు కాగా.. ఆరు టన్నుల బరువుతోనే నింగిలోకి దూసుకెళ్లింది. ఎల్‌వీఎం-3 ద్వారా చేపట్టిన తొలి వాణిజ్య ప్రయోగం ఇదే. ఇందుకోసం వన్‌వెబ్-న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ రాకెట్ ప్రయోగం మొత్తం పూర్తి కావడానికి 19 నిమిషాల 7 సెకన్ల సమయం పట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో భారత శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.