భూమికి గుడ్‌ బై.. సూర్యుడి దిశగా ఆదిత్య-ఎల్‌1 ప్రయాణం

ఆదిత్య-ఎల్‌1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం నమోదు అయ్యింది. కక్ష్యను పెంచుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

By Srikanth Gundamalla  Published on  19 Sep 2023 5:15 AM GMT
ISRO, Adithya-L1 Mission, India, Earth, Sun,

భూమికి గుడ్‌ బై.. సూర్యుడి దిశగా ఆదిత్య-ఎల్‌1 ప్రయాణం

సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. సూర్యుడిపై ప్రయోగాల కోసం తొలిసారి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది ఇస్రో. అయితే.. ఇందులో మరో కీలక ఘట్టం నమోదు అయ్యింది. సెప్టెంబర్ 19 ఉదయం 2 గంటలకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం కక్ష్యను పెంచుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ట్రాన్స్‌ లగ్రేంజియన్‌ పాయింట్-1 దిశలో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఎక్స్‌ (ట్విట్టర్) ద్వారా ఇస్రో వెల్లడించింది. భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాన్స్-లగ్రేంజియన్ పాయింట్‌లో ప్రవేశపెట్టినట్లు ఇస్రో తెలిపింది.

ఆదిత్య-ఎల్‌1 వాహన నౌక ప్రస్తుతం లగ్రాంజ్ పాయింట్‌-1 దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలో వెళ్లేలా విన్యాసం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య-ఎల్‌1ను మరొక విన్యాసంతో ఎల్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా మారిషస్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూ కక్ష్య పెంపును సమీక్షించాయి.

ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్‌ పాయింట్లను గుర్తించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆదిత్య ఎల్‌1 వెళ్తున్న తొలి లగ్రాంజ్‌ పాయింట్‌ భూమితోపాటు సూర్యుడి చుట్టూ ఆవరించి ఉంటుంది. ఇది సూర్యుడిపై పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని పరిశీలించడానికి వీలుగా ఉంటుంది. ఈ కేంద్రం నుంచే ఆదిత్య-ఎల్1 సూర్యుడిపై అధ్యయనాలు చేస్తుంది. కాగా.. సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ57 ద్వారా ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మరుసటి రోజే కక్ష్య పెంపు ప్రక్రియను ప్రారంభించింది. అయితే.. భారత్‌ తరఫున ఇస్రో సూర్యుడిపై ప్రయోగించిన తొలి మిషన్ ఇదే.

Next Story