భూకంపం మాదిరిగానే.. చంద్రునిపై ప్రకంపనలు

సౌర అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 ప్రయోగానికి శనివారం సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రునిపై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

By అంజి  Published on  1 Sept 2023 9:20 AM IST
Chandrayaan-3, Moon quake, ISRO

భూకంపం మాదిరిగానే.. చంద్రునిపై ప్రకంపనలు

సౌర అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 ప్రయోగానికి శనివారం సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రునిపై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. చంద్రునిపై పరిశోధనలు చేస్తున్న రోవర్‌.. తన పరిశోధనల్లో ఆసక్తికర అంశాలను బయటపెడుతోంది. తాజాగా భూమిపై సంభవించే భూ ప్రకంపనల మాదిరిగానే చంద్రునిపై కూడా ప్రకంపనలు వస్తున్నాయని పరిశోధనల్లో తెలిపింది. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్‌లోని భూకంపలను గుర్తించే పరికరాలు, ప్రజ్ఞాన్ రోవర్, ఇతర పేలోడ్‌ల కదలికల ఆధారంగా చంద్రుని ఉపరితలంపై ప్రకంపనలు రికార్డు చేశాయని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్ 3 ల్యాండర్‌లోని లూనార్ సిస్మిక్ యాక్టివిటీ పేలోడ్‌లో మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ టెక్నాలజీ ఆధారిత పరికరం.. రోవర్ , ఇతర పేలోడ్‌ల కదలికలను రికార్డ్ చేసిందని ఇస్రో తెలిపింది. ఆగష్టు 26, 2023న సహజంగా సంభవించే భూకంప సంఘటనను రికార్డ్ చేసిందని ఇస్రో తెలిపింది. ఈ సంఘటన గురించి ప్రస్తుతం పరిశోధన జరుగుతోందని వెల్లడించింది. సహజ భూకంపాలు, ప్రభావాలు, కృత్రిమ సంఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రకంపనలను కొలవడమే ILSA ప్రాథమిక లక్ష్యం. అంతకుముందు విక్రమ్‌ ల్యాండర్లో ఉన్న మరో పరికరం.. చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రుని ఉపరితలం సమీపంలో మొదటిసారి ప్లాస్మా కణాల కొలతలను పంపింది. చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా చాలా తక్కువగా ఉందని ఇస్రో ప్రాథమిక అంచానాకు వచ్చింది.

Next Story