బుల్లెట్ రైలెక్కి చంద్రుడిపైకి.. అటు నుంచి అంగారకుడిపైకి కూడా..!
Bullet train to the moon and mars heres how japans planning interplanetary travel. కావాల్సినప్పుడల్లా చంద్రునిపైకి బుల్లెట్ ట్రైన్‌లో వెళ్లి రావచ్చు. అటు నుంచి అటూ అంగారకుడిపై కూడా వెళ్లొచ్చు.
By అంజి Published on 18 July 2022 3:00 AM GMT''కావాల్సినప్పుడల్లా చంద్రునిపైకి బుల్లెట్ ట్రైన్‌లో వెళ్లి రావచ్చు. అటు నుంచి అటూ అంగారకుడిపై కూడా వెళ్లొచ్చు. అంతరిక్ష అందాలను ఆస్వాదించచొచ్చు.'' ఇదంతా నిజం చేస్తామంటోంది జపాన్. భూమి మీద నుంచి వయా చంద్రుడు అంగారకుడి వరకు బుల్లెట్ రైలును నిర్మించాలని ప్లాన్ చేస్తున్నది. ఇప్పటివరకైతే భూమి మీది నుంచి చంద్రునిపైకి రాకెట్లు పంపించాం, వ్యోమనౌకలో మనుషులు కూడా వెళ్లి వచ్చారు. కానీ ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి రైలు పట్టాలు వేసి, రైలులో ప్రయాణించే వినూత్న ఆలోచనకు జపాన్ సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా గ్రహాలపై బస చేసేందుకు క్యాప్సుల్స్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని కూడా నిర్మించనున్నారు. గ్రహాంతరయానం కోసం ఏర్పాటు చేసే పట్టాలను జపాన్ శాస్త్రవేత్తలు 'హెక్సాట్రాక్' అని పేర్కొన్నారు. ఈ ట్రాక్‌పై బుల్లెట్ రైలు నడిచే సమయంలో గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉన్నంతే ఉండేలా చర్యలు తీసుకొంటారు. రైళ్లు షడ్బుజి ఆకారంలో ఉంటాయి. 15 మీటర్ల వ్యాసార్థం కలిగిన చిన్న క్యాప్సుల్‌తో భూమిని, చంద్రున్ని, 30 మీటర్ల వ్యాసార్థం కలిగిన క్యాప్సుల్స్‌తో చంద్రున్ని, అంగారకుడిని లింక్ చేస్తారు. ఈ క్యాప్సుల్స్‌కు విద్యుదయస్కాంత సాంకేతికతను వాడుతారు.
ప్రస్తుతం విద్యుదయస్కాంత టెక్నాలజీని జర్మనీ, చైనాలో మాగ్లేవ్ రైళ్లకు వాడుతున్నారు. బుల్లెట్ రైళ్లు ఆగటానికి చంద్రునిపై, అంగారకుడిపై రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేస్తారు. బుల్లెట్ రైలు పేరు 'స్పేస్ ఎక్స్‌ప్రెస్' అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బుల్లెట్ రైలులో భూమ్మీద ఉండే వాతావరణాన్ని శాస్త్రవేత్తలు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రునిపై అర్టిఫిషియల్ హోమ్‌ను నిర్మించేందుకు జపాన్ బ్లూ ప్రింట్ రెడీ చేసింది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చటానికి 100 ఏళ్లు పట్టవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి మనం బతికి ఉండకపోవచ్చని, కాకపోతే 2050 నాటికి లూనా గ్లాస్, మార్స్ గ్లాస్ నమూనాలు తయారయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు.
జపాన్‌కు చెందిన క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కజిమా కన్‌స్ట్రక్షన్ సహకారంతో గాజుతో నివాస స్థలాన్ని నిర్మించనున్నారు. దాని పేరు 'ది గ్లాస్'. ఇది శంఖు ఆకారంలో, 1,300 అడుగుల పొడవుతో ఉంటుంది. అక్కడ భూమ్మీద ఉండే వాతావరణాన్ని, గురుత్వాకర్షణ శక్తిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు. ఆహార పదార్థాలు, చెట్లు, నీరు, నదులు, ఉద్యానవనాలు ఉంటాయి. ది గ్లాస్ లోపల నివాసం ఉంటే స్పేస్ సూట్ ధరించాల్సిన అవసరం ఉండదు. దాన్నుంచి బయటకు వస్తే మాత్రం ధరించాల్సిందే.