మరో నెల రోజుల్లో.. అందుబాటులోకి 5జీ సేవలు.!
5G mobile services likely to be rolled out in about a month. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హైస్పీడ్ 5జీ సేవలు దాదాపు నెల రోజుల్లో అందుబాటులోకి
By అంజి Published on 8 Aug 2022 7:01 PM ISTఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హైస్పీడ్ 5జీ సేవలు దాదాపు నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ సోమవారం తెలిపారు. ఆసియా, ఓషియానియా ప్రాంతానికి సంబంధించిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రీజినల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో 5జీ సేవలు పూర్తి స్థాయిలో అందుబటులో ఉంటాయని చెప్పారు. ''సుమారు ఒక నెలలో దేశంలో 5జీ మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది అన్ని రంగాల అభివృద్ధిపై దాని ప్రభావాన్ని చూపుతుంది. 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయబడింది. ఇది స్వదేశీ 6G స్టాక్ అభివృద్ధికి కృషి చేస్తోంది'' అని చౌహాన్ చెప్పారు.
ప్రభుత్వం దేశీయంగా అభివృద్ధి చేసిన అధునాతన టెలికాం సాంకేతికతను ప్రోత్సహిస్తోందని, ఫలితంగా నేడు భారతదేశంలో బలమైన స్వదేశీ 5G మొబైల్ కమ్యూనికేషన్‌ల పర్యావరణ వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. తాము పూర్తిగా స్వదేశీ 5G టెస్ట్ బెడ్‌ను అభివృద్ధి చేశామని మంత్రి చెప్పారు. 5జీ సేవలను ప్రారంభించేందుకు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లు కసరత్తు సాగిస్తున్నారు. సెప్టెంబర్ 29న జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను అధికారికంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 5జీ స్ప్రెక్టం వేలాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం స్పెక్ట్రం కేటాయింపులను చేపడుతోంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1.5 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా. వేలంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ డేటా నెట్‌వర్క్ కూడా పాల్గొంది. మొదటగా హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చండీఘఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రాం, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానుండగా దశలవారీగా దేశమంతటా 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తుంది. భారత్‌లో 4జీ ప్లాన్ల తరహాలోనే 5జీ ప్లాన్లు కూడా అందుబాటు ధరల్లో లభిస్తాయి.