జనవరిలో విడుదల కానున్న శశికళ..!
By సుభాష్ Published on 15 Sept 2020 3:48 PM ISTఅక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ వచ్చే ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని కేంద్ర కారాగారంలో ఆమె శిక్షను అనుభవిస్తున్నారు. అయితే శశికళను ఎప్పుడు విడుదల చేస్తారని ఆర్టీఐ కింద ప్రశ్న వేయగా.. బహుశా వచ్చే ఏడాది జనవరి 27న విడుదల అయ్యే అవకాశాలున్నాయని జైలు అధికారులు సమాధానం ఇస్తున్నారు. కోర్టు విధించిన జరిమానా చెల్లిస్తే, తప్పకుండా ఆ తేదీన విడుదల చేస్తారని తెలుస్తోంది.
కాగా, 2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్టు చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు కోర్టు వేసిన నాలుగేళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు సమర్థించింది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టింది. కానీ ఆ పార్టీ నుంచి పళనిస్వామి బృందం ఆమెను తొలగించారు. అక్రమాస్తుల కేసులో ఇళవరసై, సుధాకరన్‌లు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక వేళ పేరోల్ సదుపాయాన్ని వినియోగిస్తే శశికళ విడుదల తేదీని మార్చే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు.