ఈ సంక్రాంతి మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది : మహేష్ బాబు

By Newsmeter.Network  Published on  19 Jan 2020 4:50 PM IST
ఈ సంక్రాంతి మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది : మహేష్ బాబు

· సరిలేరునీకెవ్వరు సూపర్ డూపర్ సక్సెస్

· సంక్రాంతి బరిలో సూపర్ హిట్ సరిలేరు నీకెవ్వరు

· బాక్సాఫీస్ సూపర్ హిట్ గా సక్సెస్ టాక్

· పదిరెట్లు ఎక్కువ ఓపెనింగులతో హౌస్ ఫుల్ కలెక్షన్లు

· సినిమా సక్సెస్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు సంతోషం

· తర్వాత పూర్తి కమర్షియల్ హిట్ కోసం ప్లానింగ్

· సరిలేరు మూవీతో విజయశాంతి రీ ఎంట్రీ

ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తన కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని, ఈ సంక్రాంతి తనకు జీవితంలో మరపురాని మధురమైన అనుభూతిని మిగిల్చిందని స్టారో హీరో మహేష్ బాబు చెబుతున్నాడు.

వరసగా కొన్నేళ్లుగా సీరియెస్ ఫిల్మ్స్ చేస్తూ వస్తున్న మహేష్ బాబు ఈసారి రొటీన్ కి భిన్నంగా ఈ కొత్త సినిమా చేశాడు. ఫ్యాన్స్ తనమీద పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణించడంలో ఎప్పుడూ ముందుండే మహేష్ బాబు ఈసారికూడా పూర్తి స్థాయిలో సర్వశక్తుల్నీ కేంద్రీకరించి అద్భుతమైన నటనను కనబరిచాడీ మూవీలో.

బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సంక్రాంతి సూపర్ హిట్ నిజంగానే మహేష్ కి 2020లో గ్రేట్ లక్కుని తెచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదని తెలుగు సినీ వర్గాలు అంటున్నాయి. ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువగా ఓపెనింగ్స్ ఉన్నాయని డైరెక్టర్, నిర్మాత సంబరపడిపోతున్నారు.

ఓపెనింగుల్లో నెంబర్ వన్..

నిజానికి ఇంత భారీస్థాయిలో ఓపెనింగ్స్ ఉండడం నిజంగా అద్భుతమేనని తెలుగు సినిమా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చేసిన సినిమాల్లో చాలా భాగం సంక్రాంతికి విడుదలై హిట్లు సాధించినవే. అందుకే కృష్ణతోపాటు మహేష్ బాబుకి కూడా సంక్రాంతి సెంటిమెంట్ బలంగా ఉంది. ఈ సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు.

షూటింగ్ చేసే సమయంలోకూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో పనిచేస్తున్నామన్న ఫీలింగ్ కలిగిందని మహేష్ బాబు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం యూనిట్ అంతా సినిమా సక్సెస్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తూ సంక్రాంతి సంబరాలు సంతోషంగా జరుపుకుంది. నిజానికి తెలుగు ఇండస్ట్రీకి కూడా బ్లాక్ బస్టర్ హిట్ పూర్తి సంతోషాన్ని కలిగించే విషయమే.

మొత్తం ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ అనిల్ రావిపూడికి చెందుతుందని మహేష్ బాబుతోపాటుగా, నిర్మాత, యూనిట్ సభ్యులు అందరూ చెబుతున్నారు. సరైన కెప్టెన్ నావను సవ్యమైన దిశలో ఎలా నడిపిస్తాడో, సక్సెస్ ఫుల్ గా ఎలా తీరాన్ని చేరుస్తాడో సరిగ్గా అదే రీతిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా మలచడంలో పూర్తి సక్సెస్ ని సాధించాడని సినిమా యూనిట్ మొత్తం ఆకాశానికి ఎత్తేస్తోంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ టాక్ ని చూసి విక్టరీ హీరో వెంకటేష్ వెంటనే మహేష్ బాబుకి ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. తన సినిమా విడుదలకావడానికి ఒక రోజు ముందు మహేష్ బాబు ప్రత్యేకంగా వాళ్లమ్మ దగ్గరికెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాడు. అది తన సెంటిమెంట్. ఈ సారి కూడా ఆ సెంటిమెంట అద్భుతంగా పనిచేసి సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. తర్వాతి సినిమా పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రమేనని మహేష్ ముందే చెప్పేశాడు.

ఇదంతా ఒక ఎత్తైతే లేడీ అమితాబ్ విజయశాంతి 14 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో మళ్లీ వెండితెరమీదికి రావడం సరిలేరు నీకెవ్వరు సినిమాకి మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇండస్ట్రీలో మొదట్నుంచీ గోల్డెన్ లెగ్ అని పేరుపడ్డ విజయశాంతి ఈ సినిమాలో అత్యంత ప్రధానమైన వెర్సటైల్ పాత్రను పోషించింది.

పోటాపోటీ – కాంపిటీషన్..

హెల్తీ కాంపిటీషన్ ఎప్పుడూ ఎదుగుదలకు చాలా అవసరమని మహేష్ బాబు అభిప్రాయపడుతుంటాడు. సంక్రాంతి బరిలో నిలిచి హిట్ టాక్ సాధించిన బన్నీ సినిమా అల వైకుంఠపురములో గురించి సూపర్ స్టార్ మహేష్ పాజిటివ్ గా స్పందించాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా రిలీజ్ డేట్ల గురించి ఈమధ్యకాలంలో వచ్చిన కాంట్రవర్సీలపై తను ఈ విధంగా స్పందించాడు.

అభిమానులు మాత్రమే మితిమీరిన అభిమానంతో కాంట్రవర్సీలకు తెర లేపుతారని, హీరోలు మాత్రం ఎప్పుడూ సరదాగా, కలివిడిగా, సంతోషంగా ఉండడానికే ఇష్టపడతారని మహేష్ బాబు చెప్పాడు. ఇండస్ట్రీలో ఉన్న ఆరుగురు ఏడుగురు స్టార్ హీరోలు ఎప్పుడూ కలుసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని, ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ మంచే చేస్తుందన్న విషయం తెలిసిందేకను తామంతా ఎప్పుడూ నటనలో రాణించే విషయంలోమాత్రం పోటాపోటీగా పనిచేస్తూ ఉంటామని మహేష్ అంటున్నాడు.

కొన్నేళ్లక్రితం మహేష్ మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా వెనకాడలేదు. ఇకపై కూడా మంచి కాన్సెప్ట్, మంచి నిర్మాత, మంచి బ్యానర్, మంచి దర్శకుడు దొరికితే సందర్భానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని మల్టీస్టారర్స్ చెయ్యడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సూపర్ స్టార్ చెబుతున్నాడు.

ధియేటర్ లో సినిమా చూడ్డమే థ్రిల్లింగ్..

ఇంట్లో ఎన్ని సినిమాలు చూసినా ధియేటర్ కి వెళ్లి సినిమా చూడడంలో ఉన్న ధ్రిల్లే వేరని మహేష్ బాబు అంటున్నాడు. ఈ కారణంగానే అభిమానులు కిక్కిరిసే స్థాయిలో ధియేటర్లను హౌస్ ఫుల్ చేస్తారని, ఇప్పుడు టెక్నికల్ అడ్వాన్స్ ఉన్న మల్టీప్లెక్స్ లు, డిజిటల్ సౌండ్ సిస్టమ్స్ వచ్చాక ప్రేక్షకులు థియేటర్ లో సినిమా చూడడాన్ని మరింతగా ఇష్టపడుతున్నారని ప్రిన్స్ చెబుతున్నాడు.

స్టార్ డైరెక్టర్ శంకర్ లో భారీ స్థాయి బై లిగ్వియల్ సినిమా చెయ్యాలన్న తన చిరకాల కోరిక అని మహేష్ బాబు తెలిపాడు. కొత్త ప్రాజెక్ట్ ని వర్కవుట్ చేసేందుకు ఇప్పటికే మహేష్ రెండుసార్లు శంకర్ ని కలిశాడుకూడా. ఇంతకు ముందు తమిళ్ లోకి డబ్ అయిన మహేష్ సినిమా ఆశించిన రీతిలో విజయాన్ని, తమిళ ప్రేక్షకుల స్పందనను చవిచూడకపోవడంతో మళ్లీ మహేష్ పూర్తి స్థాయిలో శంకర్ డైరెక్షన్ లో బై లింగ్వియల్ సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు.

కుటుంబం..

తన భార్య నమ్రత పూర్తి స్థాయిలో కుటుంబానికి అంకితమైపోయిందని, మొత్తంగా పిల్లల్ని చూసుకోవడానికి, వాళ్ల బాగోగులు పట్టించుకోవడాని మాత్రమే ఆమె పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయిస్తోందనీ మహేష్ చెబుతున్నాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమిత నిజంగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో గృహిణిగా మారిపోవడం ఇండస్ట్రీకి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం.

నమ్రతతోపాటుగా అప్పుడప్పుడూ మహేష్ కూడా తన కొడుగు గౌతమ్ స్కూల్ ఫంక్షన్లకు అటెండ్ అవుతుంటాడు. ఒకవేళ అనుకున్న స్థాయిలో పిల్లలకు పరీక్షల్లో మార్కులు రాకపోతే తర్వాతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి బాగా కష్టపడాలని చెబుతుంటాడు మహేష్. తను కిందటి సారి రిలీజైన సినిమాకీ ఈసారి రిలీజైన సినిమాకీ ఎంత వైవిధ్యాన్ని చూపించాడో అదే విధంగా వాళ్లుకూడా పరీక్షలు రాసిన ప్రతిసారీ టాప్ ర్యాంక్ ని సాధించడమేకాక, ప్రతిసారీ ఇంకా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కృషి చేయాలని మోటివేట్ చేస్తుంటాడు.

పిల్లలిద్దరూ పెద్దయ్యాక వాళ్లు ఏ రంగంలో స్థిరపడాలంటే ఆ రంగంలో స్థిరపడేందుకు తను పూర్తి స్థాయిలో సహకరిస్తాననీ, ప్రోత్సాహాన్ని అందిస్తానని చెబుతున్నాడు మహేష్ బాబు. ఈ రోజుల్లో పిల్లలకు వాళ్లకు ఏం కావాలో చాలా స్పష్టంగా తెలుసని, పెద్దవాళ్ల అభిప్రాయాల్ని వాళ్ల మీద రుద్దడం అవివేకమే అవుతుందనీ, వాళ్లు ఇష్టపడ్డ మార్గంలో అయితే త్వరగా వృద్ధిలోకి వస్తారన్నది తన ఫిలాసఫీ అనీ మహేష్ బాబు చెబుతున్నాడు.

మహేష్ కూతురు సితారం ఓ యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టింది. అదిప్పుడు చాలాబాగా నడుస్తున్నట్టుగా సమాచారం. అప్పుడప్పుడూ పిల్లల్ని, భార్యని తీసుకుని దూర ప్రయాణాలకు వెళ్లడం, విహార యాత్రలు చేయడం మహేష్ బాబుకి అలవాటు. అలా కొత్త కొత్త ప్రదేశాలను చూసొస్తే కొత్త ఆలోచనలకు బీజం పడుతుందని, మానసికంగా పరిణతి చెందడానికి, అనేక కొత్త విషయాలను తెలుసుకోవడానికీ ఆ అలవాటు బాగా ఉపకరిస్తుందని చెబుతున్నాడు.

Next Story