అలవైకుంఠపురములో ఆల్ టైమ్ హిట్ – బన్నీ

By Newsmeter.Network  Published on  19 Jan 2020 10:53 AM GMT
అలవైకుంఠపురములో ఆల్ టైమ్ హిట్ – బన్నీ

  • అలవైకుంఠపురములో సినిమాకు సంక్రాంతి హిట్ టాక్
  • ఆల్ టైమ్ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్
  • త్రివిక్రమ్ పంచ్ డైలాగులకు ఈలలు కొడుతున్న ప్రేక్షకులు
  • రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు పూర్తి హౌస్ ఫుల్
  • మొదటివారంలోనే ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం
  • బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా
  • పొడుగుకాళ్ల సుందరి పూజహెగ్డేకీ స్టార్ డమ్
  • స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కాసుల వర్షం

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా తెలుగు నేలమీద రెండు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఆడుతున్న ధియేటర్లన్నీ కనీసం నుంచోవడానికికూడా చోటు లేనంతగా హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. దీంతో యంగ్ అండ్ డైనమిక్ హీరో అల్లు అర్జున్ పండగ చేసుకుంటున్నాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై చుక్కల్లో తేలిపోతున్నాడు. అలవైకుంఠపురములో సినిమాతో అశేష ప్రేక్షక లోకం తనకు కెరీర్ లో అత్యద్భుతమైన హిట్ ని ఇచ్చిందని సంతోషంగా చెబుతున్నాడు.

విడుదలైన తొలి రోజే సంక్రాంతి విజేతగా ఈ సినిమాకు హిట్ టాక్ రావడం మొత్తం క్రూ అందరికీ నిజంగానే పండగగా ఉంది. సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల్లో ఏది బాగా ఆడితే, ఏది ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోతే ఆ సినిమా ఆగకుండా సంవత్సరం పాటు ఆడిన ఘటనలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలు. అది మాత్రమే కాక అక్కడినుంచి హీరో, హీరోయిన్ల స్టార్ డమ్ ఆకాశంలో చుక్కల్ని తాకి తీరుతుందన్న సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయి ఉందికాబట్టి సంక్రాంతి హిట్ నిజంగా పండగే పండగ.

తెలుగు ఇండస్ట్రీలో బన్నీకి యూత్ లో చాలా క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన పాత్రల్ని పోషిస్తూ, వేషాల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ బన్నీ తనదైన శైలిని, ఒరవడిని సృష్టించుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అలాగే డైరెక్టర్ల ఎంపిక విషయంకూడా అల్లు అర్జున్ డెసిషన్ ఎప్పుడూ తప్పలేదు.

స్టార్ డైరెక్టర్ గా, పంచ్ డైలాగుల కింగ్ గా ఇండస్ట్రీలో మంచి పేరున్న రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగానే పంచ్ డైలాగులకు పుల్ స్టాప్ పెట్టాడు. ప్రతి సినిమాలోనూ పంచ్ డైలాగులకు పెద్దపీట వేస్తూ పోతే కొన్నాళ్లకు మొనాటనీ వస్తుందన్న భయంతో ఉద్దేశపూర్వకంగా కావాలని రెండు మూడు సినిమాలు ట్రాక్ మార్చి చూశాడు.

త్రివిక్రమ్ స్ట్రాటజీ పూర్తిగా వర్కవుట్ అయ్యింది. రెండు మూడు సినిమాలు ప్లాప్ అయిన తర్వాత వచ్చే సూపర్ డూపర్ హిట్ రుచి ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి తను పూర్తిగా తెలుసుకుని ఆ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలవైకుంఠపురములో సినిమాలో హీరోపేరు బంటు. తన తల్లిదండ్రులు సుఖంగా జీవించడానికి కావాల్సినవన్నీ చేసేస్తాడు బంటు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డ్రామాని, విలువలను పండించంలో సక్సెస్ సాధిస్తే, అల్లు అర్జున్ అసలు తన ఇమేజ్ ని పూర్తిగా మర్చిపోయి కేవలం పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడంలో దృష్టిపెట్టి ధమాకా హిట్ కొట్టాడు. ఒక దశలో అసలు తను స్టార్ ని అన్న విషయాన్నికూడా మర్చిపోయేలా చేసే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయనీ, అవి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయనీ అల్లు అర్జున్ చెబుతున్నాడు.

ప్రేక్షకులు అల్లు అర్జున్ పాటలు, డ్యాన్స్ లు, పైట్లకోసం పడి చచ్చిపోతారు. కానీ ఈ సినిమాలో వాటన్నింటికంటే మిన్నగా బన్నీ తన యాక్టింగ్ టాలెంట్ ని పీక్ లెవెల్ కి తీసుకెళ్లాడు. పూర్తిగా నటనపైనే దృష్టిని కేంద్రీకరించి అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలచిపోయే ముద్రను వేశాడు.

పారిస్ లో సామజవరగమనా పాటను షూట్ చేస్తున్న సమయంలో తనకు అసలైన పరీక్ష ఎదురయ్యిందని బన్నీ చెబుతున్నాడు. అక్కడ ఉన్న చల్లదనానికి కనీసం సరిగ్గా నడవడానికి కూడా వీల్లేదు. కానీ అతికష్టంమీద ఎలాగోలా మ్యానేజ్ చేసి ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న ఆశలకు సరైన న్యాయం చేశానని చెప్పాడు.

పొడుగుకాళ్ల సుందరి పూజహెగ్డే సోయగాల విరిజల్లును ఈ సినిమాలో ప్రేక్షకులు పీక్ లెవెల్ కి ఆస్వాదిస్తున్నారని మొదటి వారంలోనే టాక్ నడుస్తోంది. పొడుగు కాళ్ల సుందరిగా కొన్నేళ్లపాటు బాలీవుడ్ ని ఏలిన శిల్పాశెట్టి తర్వాత మళ్లీ అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో, కోలీవుడ్ లో అసలు ఇంతెందుకు మొత్తంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే పూజ హెగ్డేని మించిన పొడుగుకాళ్ల సుందరి మరొకరు లేరన్న స్టార్ ఫీల్ టాక్ ఇండస్ట్రీని ఇప్పుడు ఊపేస్తోంది.

అవకాశాన్ని అందిపుచ్చుకున్న పూజ తన పొడుగుకాళ్ల సోయగాల గురించి, తన అందం గురించి నేరుగానే ట్వీట్లు చేస్తూ ఈ సినిమా టాక్ ద్వారా వీలైనంతగా పాపులారిటీని పెంచుకోవడానికి తనవంతు కృషి తను చేసింది. మత్తెక్కించే భావాలను సైతం కళ్లలో పలికించగల సత్తా ఉన్న ఈ చిలిపి చూపుల సుందరికికూడా బన్నీతోపాటుగా అలవైకుంఠపురములో సినిమా సూపర్ డూపర్ కెరీర్ హిట్టే అని చెప్పాలి.

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎస్.రాధాకృష్ణతో కలిసి గీతాఆర్ట్స్, హారికా హసీనే క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు. జయరామ్, టబు, సుశాంత్, నివేత పేతురాజ్, పూజహెగ్డే, హర్షవర్థన్, సునీల్ లాంటి హేమాహేమీ స్టార్ క్యాస్టింగ్ ఈ మూవీకి నిజంగానే పెద్ద అస్సెట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Next Story
Share it