రాజకీయం అంటే ఇదీ..మోదీతో పవార్ భేటీ..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 6:56 AM GMT
రాజకీయం అంటే ఇదీ..మోదీతో పవార్ భేటీ..!!

ముఖ్యాంశాలు

  • మహారాష్ట్రలో పొలిటికల్ ప్రకంపనలు
  • ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
  • సోనియాతో మీట్ ను వాయిదా వేసుకున్న పవార్
  • శివసేనకు మూడుతాడు వేసే ఆలోచనలో బీజేపీ
  • పవార్ కు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు
  • ప్రభుత్వ ఏర్పాటుపై నమ్మకంగా ఉన్న శివసేన

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు చాణుక్యుని ఆలోచనలకు కూడా అందడం లేదు. శివసేన రెండు పావులు కదిపితే..బీజేపీ ఆరు పావులు కదుపుతుంది. సీఎం పీఠంపై ఆశతో శివసేన సిద్దాంతాలకే తిలోదకాలు ఇస్తే..బీజేపీ ఒక మిత్రుడు పోతే పోనివ్వూ మరో మిత్రుడు కోసం వేట మొదలు పెట్టింది. బీజేపీ వేటకు ఎన్సీపీ దొరికినట్లే కనిపిస్తోంది. ఈ రోజు ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ అవుతున్నారు. తమను ముప్పతిప్పలు పెట్టే ఎన్సీపీ అంతుతేల్చడానికి బీజేపీ సిద్ధమైంది. పక్కా రాజకీయ ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఎవరూ ఊహించని విధంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మోదీతో భేటీ కాబోతున్నారు. దీంతో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు - శాశ్వత శత్రువులు ఉండరని తేలిపోయింది. రాజకీయమే పరమావధిగా బీజేపీ పావులు కదుపుతుంది. తమ దారికి రాని శివసేనకు తమ సత్తా చూపించడానికి బీజేపీ సిద్ధమైంది. ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాలపై మోదీ - పవార్‌ చర్చించనున్నారు. ఎన్‌డీఏలో కి రావాలని ఎన్సీపీని మోదీ ఆహ్వానిస్తారని సమాచారం. దీని కోసం పవార్‌కు కమలనాధులు భారీ ఆఫర్ ఇచ్చినట్లు కూడా ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్సీపీ అధినేత పవార్‌కు బీజేపీ ఇచ్చిన భారీ ఆఫర్ ఏంటో అధికారికంగా బయటకు రానప్పటికీ...శివసేన మాత్రం పలు ఆరోపణలు సంధించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర వహించే అవకాశాన్ని శరద్ పవార్‌కు బీజేపీ ఇవ్వనుంది. అలాగే...శివసేన ఆరోపించినట్లు పవార్‌కు రాష్ట్రపతి పదవి బీజేపీ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే..దీనిపై కమలనాధులు ఎక్కడా కూడా అధికారికంగా నోరు విప్పడంలేదు. అయితే.. ఈ వార్తలపై ఇప్పటి వరకూ ఎన్సీపీ కూడా అధికారికంగా స్పందిచలేదు. రాజకీయంగా భేటీ జరగడంలేదని మాత్రమే చెబుతోంది. మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు పవార్‌ భేటీ అవుతున్నారని ఎన్పీపీ లీక్‌లు మాత్రం ఇస్తుంది.

ప్రధాని మోదీతో పవార్‌ భేటీ అనే వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. రాజకీయంగా బీజేపీ - శివసేన దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఎన్సీపీ కూడా పవార్‌ భేటీపై ఆచితూచి స్పందిస్తుంది. సోనియాతో భేటీని కూడా పవార్‌ వాయిదా వేసుకున్నారు. అయితే...మోదీ ఏం చెబుతారు..?. పవార్ ఏం అడుగుతారు..?. పొలిటికల్ డీల్ కుదురుతుందా?. శివసేనకు మూకుతాడు వేయడానికి ఎంతదూరమైనా బీజేపీ వెళ్తుందా? అనేది ఇరువురు భేటీ తరువాత తేలనుంది.

ప్రధాని మోదీ, పవార్ భేటీపై ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. కాకపోతే...ప్రస్తుత పరిణామాలను కాంగ్రెస్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే..శివసేన మాత్రం పొలిటికల్ డైలాగ్‌లు వదలడం ఆపలేదు. ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకంతోనే శివసైనికులు ఉన్నారు.

Next Story