గాలిపటాలు ఎగరవేయడం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా..?

By సుభాష్  Published on  5 Jan 2020 11:01 AM GMT
గాలిపటాలు ఎగరవేయడం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా..?

సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే పతంగులతో చిన్నారులు సందడి చేస్తుంటారు. కొత్త సంవత్సరంలో తొలి పండగ కాబట్టి అందరు ఉత్సాహంగా ఈ సంక్రాంతి పండగను జరుపుకొంటారు. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజు దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈరోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. ఈ సంక్రాంతి పండగ పుష్యమాసంలో వస్తుంది. ఈ పండగను మూడు రోజుల పాటు జరుపుకొంటారు. దీనిని పెద్ద పండగగా కూడా పరిగణిస్తారు. మార్గశిర మాసం, పుష్యమాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఈ పండగ వచ్చిందంటే రంగు రంగుల ముగ్గులతో ఇంటి ముందర అందాలు తీసుకువస్తే, గాలిపటాలతో అకాశం మొత్తం ఇంద్రధనస్సులా మారిపోతుంది. చిన్నారులు గాలిపటాలను ఎగురవేస్తే కేరింతలు కొడుతూ ఉత్సాహంలో మునిగిపోతారు. మరో వైపు చిన్నారులకు సంక్రాంతి సెలవులు ఉండటంతో మొత్తం గాలిపటాలు ఎగురవేయడంలోనే మునిగితేలిపోతారు.

Sankranti

అసలు గాలిపటం ఎలా పుట్టిందంటే..

ఈ గాలిపటం ఎగురవేయడం చైనా దేశంలో పుట్టింది. 3వేల సంవత్సరాల క్రితం పరిచయం చేసిన చైనా.. హేన్‌ వంశపురాజుల పాలనలో గాలిపటం మూలాలున్నాయని చరిత్ర చెబుతోంది. అక్కడి నుంచి ప్రపంచానికి పాకినట్లు చరిత్రకారులు చెబుతున్నమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గాలిపటాలను ఎగురవేసే సంస్కృతి సంప్రదాయంగా వస్తోంది. కాగితంతో చేసిన ఈ గాలిపటాలను సైనికులకు సందేశాలు పంపడానికి వినియోగించేవారనట చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా దేశానికి చెందిన సేనాపతి క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో తన సైనికులకు పతంగుల ద్వారా గుప్త సందేశాలు పంపేవాడని చరిత్ర చెబుతోంది. 19వ శతాబ్దంలో పతంగితో కెమెరాను జత చేసి అకాశంలో ఎగురవేసి పైనుంచి భూమి ఫోటోలు తీయడం జరిగిందట.

Kite

అంతర్జాతీయ పతంగుల పండగకు హైదరాబాద్‌ వేదిక:

మన దేశంలో సంక్రాంతి పండగ సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం అనేక దశాబ్దాలుగా కొనసాగుతోంది. అంతర్జాతీయ పతంగుల పండగకు హైదరాబాద్‌ వేదిక కూడా కావడం విశేషం. ఇక సంక్రాంతి అంటే పిల్లలకు, రైతులు, మహిళలకు పండగే అని చెప్పాలి. పతంగులు ఎగురవేయడం, యువతులు గొబ్బెమ్మలు, ముగ్గులు వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇక పల్లెటూర్లలోనైతే పిల్లలు పతంగులను తీసుకుని గ్రామ శివారులో ఉన్న పొలాల్లోకి వెళ్లి ఎగరవేస్తారు. ఇటీవల విభిన్న ఆకారాల్లో , వివిధ రంగుల్లో గాలిపటాలు వస్తున్నాయి. పిల్లలు దాబాపైకి ఎక్కి గాలిపటాలు ఎగురవేస్తుంటారు. కొన్ని చోట్ల అయితే ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు. అలాగే పిల్లలకు సైతం గాలిపటాల పోటీలు పెడుతుంటారు. ఆయా నగరాల్లో ఉన్న మైదానాల్లో గాలిపటాలు ఎగురవేస్తూ పోటీల్లో పాల్గొంటారు.

Kite Shop 2

Next Story