ఈ పోరులో సర్వశక్తులొడ్డుతాం..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 19 Aug 2020 12:16 PM GMT‘సంజయ్‌దత్ ఆరోగ్య పరిణామంతో కుటుంబం ఒక్కసారిగా దెబ్బతింది. ఇది అనూహ్యం. అయితే ఈ షాక్ నుంచి త్వరగా కోలుకోవాల్సిందే. ఎందుకంటే వ్యాధితో పోరాడ్డానికి మా సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తుంది. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అంటూ సంజయ్‌దత్ భార్య మాన్యతా తెలిపారు. ట్రీట్‌మెంట్ కోసం సంజయ్‌దత్ షూటింగ్‌లకు విరామం పలికాక.. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటన్న.. విషెస్ చెబుతున్న సమస్త అభిమానులకు ధన్యవాదాలు తెలిపినట్లు ఎన్డీటీవీ వెబ్‌సైట్లో ప్రచురించారు.
సంజయ్‌దత్ చికిత్స కోసం ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రికి వెళ్ళిన సందర్భంగా మాన్యతా ఈ ప్రకటన చేసింది. అయితే సంజయ్‌దత్ తన అనారోగ్యానికి సంబంధించి ఏ విషయాలు వ్యక్తం చేయలేదు. అయితే మాన్యత మాత్రం దత్ ఓ పెద్ద సవాల్‌ను ఎదుర్కొం టున్నారని, అయితే చాలా సానుకూలంగా ఉంటున్నారని వివరించింది. ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన మాన్యతా కొన్ని రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటున్నందున సంజయ్‌దత్ హాస్సిటల్‌కు వెళ్ళినపుడు తాను వెళ్ళలేకపోయింది. మాన్యతా తన ప్రకటనలో సంజయ్‌దత్ సోదరి ప్రియాదత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం తమకు ఆమే దారిదీపమని అభివర్ణించింది. ప్రియాదత్ దత్ ఫ్యామిలీ కేన్సర్ ఫౌండేషన్‌లో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే తన తల్లి నర్గిస్‌దత్ ఈ వ్యాధితో ఎలా పోరాడారో స్వయంగా చూసింది.
సంజయ్‌దత్ ప్రకటనానంతరం చాలా మంది రిపోర్టర్లు తనకు క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని ప్రకటించేశారు. అందుకే మాన్యత తన స్టేట్‌మెంట్‌లో ‘ఇలాంటి ఊహాగానాలను ఆపండి’ అని కోరింది.
మాన్యతా ప్రకటన :
‘సంజూ అభిమానులు శ్రేయోభిలాషులకు మా ధన్యవాదాలు. ఇన్నాళ్ళు మీరు చూపిస్తున్న అభిమానానికి మా కృతజ్ఞతలు. సంజు జీవితంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రతి కఠిన సయమాల్లోనూ తను ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగారంటే అది కేవలం మీరు చూపిస్తున్న అభిమానం సాయంతోనే. అందుకు తానెప్పుడు కృతజ్ఞతలు చెబుతునే ఉంటారు. ఇప్పుడు కూడా అలాంటి పరీక్షే మాకు ఎదురయ్యింది. మీ అభిమానంతో ఈ సమస్యను కూడా అవలీలగా అధిగమించ గలమని అనకుంటున్నాను.
కుటుంబ సభ్యులుగా ఈ పరిణామాన్ని సానుకూలంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతకు మునుపు ఎలా నార్మల్‌గా ఉన్నామో అంతే నార్మల్‌గ ఉండటానికి ప్రయత్నిస్తున్నాము. ఇది ఒక రోజుతో పరిష్కారమయ్యే సమస్య కాదని మాకు తెలుసు. అందుకే సుదూర ప్రయాణానికే సిద్ధమవుతున్నాం. సంజు కోసం ఎలాంటి వ్యతిరేక భావనలు రాకుండా జాగ్రత్త పడుతున్నాం.
ఈ కష్టకాలంలో మరో పరీక్ష ఏంటంటే నేను తనకు తోడుగా ఉండలేకపోవడం. క్వారంటైన్ ఎప్పుడు ముగుస్తుండా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మరో రెండ్రోజుల్లో ఇది కూడా ముగుస్తుంది. ఆ మరుక్షణం నేను సంజు ముందు వాలిపోతాను. ప్రతి యుద్ధంలోనూ దారిచూపే దీపధారులుంటారు. ఈ సమయంలో ప్రియాదత్ ముందుండి మమ్మల్ని నడిపిస్తుంది. తనకు రెండు దశాబ్దాలుగా మా ప్యామిలీ నిర్వహిస్తున్న క్యాన్సర్ ఫౌండేషన్‌లో పనిచేసిన అనుభవం ఉంది. తల్లి కేన్సర్‌తో పోరాడుతున్నప్పుడు తాను దగ్గరగా చూసింది. అందుకే తను టార్చ్‌బేరర్‌గా.. నేను సంజు రక్షకురాలిగా ముందుకు సాగుతాం.
సంజు ప్రాథమిక చికిత్స ముంబైలోనే ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడికి ఎప్పుడ వెళ్ళాలో కోవిడ్ పరిస్థితిని బట్టి నిర్ణయించుకుంటారు. కోవిడ్ బలహీనపడ్డాకే సంజు తదుపరి ప్రయాణం ఉంటుంది. అంతదాకా కోకిలాబెన్ ఆస్పత్రిలో సమర్థులైన డాక్టర్ల చేతిలో సంజు చికిత్సలు కొనసాగుతాయి. అప్పటిదాకా సంజు ఆరోగ్యవిషయంగా ఎలాంటి పుకార్లు సృష్టించవద్దని చేతులు మొక్కి కోరుతున్నా. సంజు చికిత్సకు సంబంధించి విషయాలు ఎప్పటికప్పుడు డాక్టర్లే తెలియజేస్తారు. సంజు నాకు భర్తగా, పిల్లలకు తండ్రిగా మాత్రమే కాదు తల్లిదండ్రులను పోగొట్టుకున్న అంజు, ప్రియలకు కూడా తండ్రిలాంటి వాడే. మా కుటుంబానికి సంజు ఆత్మ.. సంజు సర్వస్వం. అందుకే ఈ యుద్ధంలో సర్వశక్తులొడ్డి పోరాడాలనుకుంటున్నాం’
ఇదీ మాన్యత ప్రకటనా పాఠం. అందరూ కోరుకుంటున్నట్లే సంజయ్‌దత్ త్వరగా కోలుకుని మరిన్ని సినిమాల్లో తన కళాప్రతిభను ప్రదర్శించాలని ఆశిద్దాం!